‘హను – మాన్’ ప్రాజెక్ట్ మొదలెట్టినప్పుడు ఎవరికీ ఆ సినిమాపై ఆశలు, అంచనాలూ లేవు. ఎప్పుడైతే టీజర్ వచ్చిందో.. అప్పుడు అటెన్షన్ సంపాదించుకొంది. ప్రశాంత్ వర్మ ఏదో చేస్తున్నాడు, ఓ విజువల్ వండర్ క్రియేట్ చేస్తున్నాడన్న నమ్మకాలు మొదలయ్యాయి. మెల్లగా ఈ ప్రాజెక్ట్ క్రేజ్ సంపాదించుకొంది. ఈ యేడాదే విడుదల కావాల్సిన సినిమా ఇది. విజువల్ ఎఫెక్ట్స్‌పై రాజీ లేని ప్రయత్నాల వల్ల సినిమా ఆలస్యమైంది. ఇప్పుడు సంక్రాంతికి వస్తోంది. పండగ బరిలో తమ సినిమా ఉందన్న విషయం ‘హను – మాన్’ టీమ్ చాలా కాలం క్రితమే చెప్పింది. అయితే.. ఈ సంక్రాంతికి సినిమాల జోరు ఎక్కువగా కనిపిస్తోంది. అందుకే ‘హను – మాన్’ ఈ పోటీలో నిలబడగలుగుతుందా? లేదా? అసలు ఈ సినిమా పండక్కి వస్తుందా, రాదా? అనే డౌట్లు మొదలయ్యాయి. ఓ దశలో హనుమాన్ ఉండకపోవొచ్చు అనుకొన్నారు. కానీ… టీమ్ రిస్క్ తీసుకోంది. ఈ సినిమాని చెప్పినట్టే జనవరి 12న తీసుకొస్తామని మరోసారి స్పష్టం చేసింది. మరోవైపు ప్రమోషన్లు కూడా మొదలెట్టేసింది.
సంక్రాంతి మంచి సీజన్. ఈ సీజన్లో ఎలాంటి సినిమాలొచ్చినా.. జనం ఆదరిస్తారు. చిన్నా, పెద్దా తేడా లేదు. కాకపోతే… ఈ పండక్కి కనీసం 5 సినిమాలు బరిలో నిలుస్తున్నాయి. వాటిలో గుంటూరు కారం, సైంధవ్, ఈగల్, నా సామి రంగ లాంటి సినిమాలున్నాయి. వీటి మధ్య `హనుమాన్` బలం సరిపోతుందా లేదా అనేది చూడాలి. అయితే హనుమాన్ కి ఓ ప్లస్ పాయింట్ ఉంది. ఇది దేవుడి సినిమా. పైగా క్లీన్ ఇమేజ్ తో వస్తోంది. కుటుంబ సమేతంగా చూడగలిగే లక్షణాలు ఈ సినిమాలో ఉన్నాయి. అదే.. చిత్రబృందం ధైర్యం కావొచ్చు. జనవరి 1 నుంచి 12 వరకూ బాక్సాఫీసు కాస్త ఖాళీగా కనిపించే అవకాశాలు ఉన్నాయి. ఆ సమయంలో `హను మాన్`ని తీసుకొస్తే సోలో రిలీజ్ దొరకొచ్చు. దాంతో పాటు థియేటర్లూ నిండుగా కనిపిస్తాయి. మరి హనుమాన్ టీమ్ ఈ ఛాన్స్ ఎందుకు వాడుకోవడం లేదో..?