టీజర్, ట్రైలర్లతో అందరి దృష్టినీ తమ వైపు తిప్పుకొంది ‘హనుమాన్’. ఏ మాత్రం అంచనాలు లేని స్థాయి నుంచి ఈరోజు.. సంక్రాంతికి పోటీ ఇచ్చే సినిమాగా నిలిచింది. కానీ దురదృష్టం.. ఈ సినిమాకి థియేటర్లు దొరకడం లేదు. 12న విడుదల అవుతున్న ‘గుంటూరు కారం’ దాదాపు 90 శాతం థియేటర్లను ఆక్రమించుకొంటోంది. కొన్ని ఏరియాల్లో ‘హనుమాన్’కి కనీసం ఒకట్రెండు థియేటర్లు కూడా దొరక్కపోవడం చూస్తుంటే ఈ సినిమాని ఏమేరకు టార్గెట్ చేస్తున్నారో అర్థం అవుతోంది.
ఇప్పటి వరకూ తమకు జరుగుతున్న అన్యాయం పై మౌనంగా ఉన్న టీమ్ ఇప్పుడిప్పుడే నోరు విప్పుతోంది. నిర్మాత నిరంజన్ రెడ్డి కూడా ఇప్పుడు స్పందించారు. తమ సినిమాని కావాలని తొక్కేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ లో 75 సింగిల్ స్క్రీన్లు ఉంటే కనీసం 10 కూడా తమకు ఇవ్వలేదని అంటున్నారు నిరంజన్. నిజంగానే ఉన్న థియేటర్లన్నీ ఆక్రమించుకొని వార్ వన్ సైడ్ చేయడం అన్యాయమే. నైజాం మొత్తం దిల్ రాజు చేతుల్లో ఉంది. ఆయన ‘గుంటూరు కారం’ చిత్రాన్ని నైజాంలో పంపిణీ చేస్తున్నారు. అన్ని థియేటర్లలోనూ తన సినిమానే పడాలన్నది వ్యాపార వేత్తగా దిల్ రాజు ఆలోచన. అయితే.. హనుమాన్‌కి కూడా ఎన్నో కొన్ని థియేటర్లు ఇస్తే బాగుండేది. రెండు మూడు రోజుల్లో ఈ పరిస్థితి సద్దుబాటు అవుతుందన్న ఆశ ఉందని, అంతగా కాకపోతే సినిమా విడుదలయ్యాక థియేటర్లు వాటంతట అవే పెరుగుతాయన్న నమ్మకం వ్యక్తం చేశారు నిరంజన్. తమది కేవలం సంక్రాంతికి వచ్చి వెళ్లిపోయే సినిమా కాదని, కనీసం నాలుగైదు వారాలు బాక్సాఫీసు దగ్గర సినిమా ఉంటుందని, అందుకే సంక్రాంతికి పెద్దగా వసూళ్లు రాకపోయినా, ఇబ్బంది లేదని చెబుతున్నారాయన.
ఈ సినిమాపై దాదాపుగా రూ.70 కోట్లు ఖర్చు పెట్టార్ట. రూ.30 కోట్లలో సినిమా తీద్దామకొన్నామని, చివరికి రెట్టింపు కంటే ఎక్కవ బడ్జెట్ అయ్యిందని, సినిమా క్వాలిటీ విషయంలో రాజీ పడకూడదనే ఇంతలా ఖర్చు పెట్టామని నిర్మాత చెబుతున్నారు. మరీ ఆయన చెప్పినట్టు ఈ సినిమాకి రూ,70 కోట్లు అయ్యుండవు కానీ, కనీసం రూ.40 కోట్లయినా పెట్టుబడి పెట్టుంటారు. అది కూడా పెద్ద మొత్తమే. సంక్రాంతికి వస్తే తప్ప రికవరీ చేయలేని బడ్జెట్ ఇది. అందుకే నిర్మాత ఇంత రిస్క్ తీసుకొంటున్నాడు.