చిరంజీవికి హనుమాన్ అంటే ఎంతిష్టమో ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. ఆయన సినిమాల్లో హనుమంతుడికి సంబంధించిన రిఫరెన్సులు అక్కడక్కడ కనిపిస్తుంటాయి. ‘జగదేక వీరుడు – అతిలోక సుందరి’లో హనుమాన్ పై ఓ పాటే ఉంది. ఇప్పుడు `విశ్వంభర`లోనూ హనుమంతుల వారి రిఫరెన్సులు ఉండబోతున్నాయి. అంతే కాదు.. హనుమాన్ పై ఓ పాట కూడా సెట్ చేశారు. ఈ పాట ఈ సినిమాకే ప్రత్యేక ఆకర్షణ కానుందని సమాచారం. కీరవాణి ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్న సంగతి తెలిసిందే. హనుమాన్ పై ఆయన ఓ అద్భుతమైన పాట కంపోజ్ చేశారని తెలుస్తోంది. ఈ పాటని త్వరలోనే విడుదల చేయబోతున్నారు. ఈ సినిమా కోసమే 40 అడుగుల ఎత్తులో ఆంజనేయ స్వామి విగ్రహాన్ని సెట్లో ప్రతిష్టించారు. ‘విశ్వంభర’ కాన్సెప్ట్ టీజర్లోనూ ఆంజనేయుడి విగ్రహం కనిపిస్తుంది. కథలోనూ ఆ విగ్రహం ఓ కీలక పాత్ర పోషించబోతోంది.
Read Also: ‘విశ్వంభర’ విలన్ వచ్చేశాడు
‘విశ్వంభర’ ఓ సోషియో ఫాంటసీ సినిమా. ఈ సినిమా కోసం దర్శకుడు వశిష్ట ఓ కొత్త లోకాన్నే సృష్టించబోతున్నాడు. అందుకు సంబంధించిన విజువల్స్ అబ్బుర పర్చబోతున్నాయని టాక్. వీఎఫ్ఎక్స్కి ఎక్కువ ప్రాధాన్యం ఉన్న సినిమా ఇది. అందుకోసం 4 నెలలు కేటాయించబోతున్నారు. త్రిష కథానాయికగా నటిస్తోంది. ‘నా సామి రంగ’ ఫేమ్ ఆషికా రంగనాథ్ ఓ కీలక పాత్రలో కనిపించబోతోంది. యూవీ క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. 2025 జనవరి 10న సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు.