భిన్నసంస్కృతులు , విభిన్న ఆచారాలమేలికలయికే లౌకికరాజ్య పునాది. అతిపెద్ద ప్రజాస్వామిక దేశమైన భారత్ లో ఇది చాలా స్పష్టంగా కనబడుతుంది. హిందూముస్లీంలు భాయీభాయ్ అన్నది అనేక సందర్భాల్లో వెల్లడైంది. హిందూముస్లీం మధ్య మతపరమైన ఆచారాలను పరస్పరం గౌరవించుకోవడం కూడా అనాదిగా వస్తున్నదే. మతపరమైన వారధి బలంగా ఉందనడానకి అనేక ఉదాహరణలు చెప్పుకోవచ్చు. నిజానికి మనదేశాన్ని ముస్లీం పాలకులు పరిపాలించే కాలంనుంచే ఈ బంధం ఉండేది. హిందువులకూ, ముస్లీంలకు మధ్య మతపరమైన స్నేహబంధంతోపాటుగా వివాహబంధాలు కూడా ఉండేవి. దీంతో మతాలువేరైనా మనమంతాఒక్కటే అన్న భావం చిగురించేది. హిందువుల టెంపుల్స్ కి ముస్లీంలు వెళ్లేవారు. అలాగే మసీదులో ప్రార్థనలకు హిందువులు వెళ్లేవారు. ఆమాటకొస్తే ఇప్పటికీ కేరళలోని ఒక మసీదులో హిందువులు కూడా ప్రార్థనలు చేస్తుంటారు. అలాగే, ప్రపంచంలోకెల్లా అతిపెద్ద టెంపుల్ గా పేరుబడ్డ బీహార్ లో హిందూఆలయ నిర్మాణాన్ని ముస్లీంలే చేపట్టారు. ఈ సందర్భంగా ముస్లీంలు కట్టించిన రెండు హనుమంతుడి ఆలయాల గురించి చెప్పుకుందాం.
అయోధ్యలో హనుమాన్ ఆలయం
ఇది అయోధ్యలో ఉంది. అయోధ్య అంటే రాముడి జన్మస్థలి. అక్కడున్న హనుమాన్ ఆలయానికి చేరుకోవాలంటే 76మెట్లు ఎక్కాల్సిందే. ఏదో ఒక కోటకు చేరుకోవడానికి ఎక్కుతున్నట్లుంటుంది. ఈ ఆలయానికి సంబంధించి ఆసక్తికరమైన కథనం ప్రచారంలో ఉంది. 300ఏళ్ల క్రిందట నవాబ్ మన్సూర్ అలీ పరిపాలిస్తున్న రోజుల్లో ఓసారి ఆయన కుమారుడు తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. రోజురోజుకీ ఆరోగ్యం క్షీణిస్తుండటంతో నవాబ్ ఆందోళనకు గురయ్యాడు. ఎవరో చెబితే తన కొడుకు ఆరోగ్యంకోసం హనుమంతునికి పూజలుచేయించాడు. ఆశ్చర్యకరంగా అబ్బాయి ఆరోగ్యం మెరుగుపడింది. అప్పటినుంచీ నవాబ్ ఈ దేవుడిమీద నమ్మకం కుదిరింది. సుమారు 20ఎకరాల స్థలంలో హనుమాన్ టెంపుల్ కట్టించాడు. ఈ ఆలయం ప్రత్యేకత ఏమంటే, నాలుగువైపులా చూడటానికి ఇది కోటలా ఉండటం. అయోధ్య వెళ్లే భక్తులు ఈ హనుమంతుడి ఆలయాన్ని కూడా సందర్శిస్తుంటారు.
అలిగంజ్ హనుమాన్ టెంపుల్
లక్నోలో ఉంది ఈ హనుమంతుని ఆలయం. చాలాకాలం క్రిందట నవాబ్ మొహమ్మద్ అలీ షా భార్య బేగం రబియాకు కలలో ఓ పెద్ద హనుమంతుడి విగ్రహం కనిపించిందట. అదికూడా ఎక్కడోకాదు, వారి ఉద్యానవనానికి చేరువలోనే… ఆ విగ్రహాన్ని వెలికితీసి ఆలయం కట్టించినట్టు కూడా కలగంటుంది. ఆ తర్వాత ఆమెకు పిల్లాడు పుడతాడు. వెంటనే ఆమె తానుకలలో కనిపించిన చోట తవ్వకాలు జరపమని ఆదేశిస్తుంది. కలలో కనిపించినట్టే అక్కడ పెద్ద ఆంజనేయ విగ్రహం దొరికింది. అక్కడికి సమీపంలో ఆలయం కట్టించాలనుకుని దాన్ని అక్కడకు తరలించడానికి ప్రయత్నించారు. ఏనుగుకు తాళ్లుకట్టి విగ్రహాన్ని తాళ్లతో బిగించారు. అయితే ఏనుగు కదలనంటూ మొరాయించింది. మోకాళ్లమీద అలాగే కూర్చుండిపోయింది ఏనుగు. దీంతో ఇది దైవాజ్ఞగా భావించిన బేగం అక్కడే ఆలయం కట్టించాలని అనుకున్నారు. అలా అలిఘడ్ హనుమాన్ ఆలయం వెలిసింది. బారా మంగళ్ అనే ఉత్సవాన్ని ప్రతిఏటా హిందూముస్లీంలు కలిసే చేసుకుంటూఉంటారు.
మరికొద్దిరోజుల్లో వినాయకచవితి వస్తున్న సందర్బంగా ఈ మతసామరస్య సంఘటనలను మనమంతా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఎంతైనాఉంది.