అరవై ఏడేళ్ళ నారా చంద్రబాబు నాయుడు అధికారంలో వున్నా లేకపోయినా నలభైఏళ్ళుగా రాజకీయాల్లో ప్రతి సందర్భంలో, ఏదో ఒక స్ధాయిలో, స్ధానంలో కేంద్రబిందువుగానే వున్నారు. సంకల్పం, కృషి, పట్టుదలలతో తనను తాను తీర్చిదిద్దుకునే క్రమంలో స్వాభావికమైన మధ్యతరగతి మనస్తత్వాన్ని వొదులుకోకపోవడమే చంద్రబాబు ఉనికీ, అస్ధిత్వమూ…తెలుగుదేశానికి వున్న కార్యకర్తల్లో లక్షల లక్షల మందికి స్పూర్తి చంద్రబాబులో వున్న ఈ విశిష్టతే!
గ్రామీణ ఆర్ధిక శాస్త్రంలో పోస్టుగ్రాడ్యుయేట్ అయిన చంద్రబాబు నాయుడు కి తిరుపతి ఎస్ వి యూనివర్సిటీ విద్యార్ధిగా వున్నప్పటి నుంచే రాకీయాల్లో ఆసక్తి వుంది. విండోస్ రాకముందే డాస్ ఆపరేటింగ్ సిస్టమ్ తో కంప్యూటర్ వినియోగించుకున్న శ్రద్ధగల విద్యార్ధి. తన కు వున్న విజ్ఞానాన్ని, జ్ఞానాన్ని రాజకీయాలకు ఆలోచనల ద్వారా, ఆచరణ ద్వారా ఆపాదించిన వృత్తినిపుణుడు.
మొదటకాంగ్రెస్ లో, తెలుగుదేశంలో చేరక ముందు – చేరి పార్టీ బాధ్యతలు అందుకునేవరకూ మొదటి దశ అనుకుంటే, పార్టీ అధ్యక్షుడూ, ముఖ్యమంత్రీ అయిన ఎన్ టిఆర్ కు సలహాలు ఇవ్వడం వరకూ రెండోదశ. స్వయంగా ముఖ్యమంత్రే అయింది మొదలు ఇంత వరకూ మూడోదశగా చంద్రబాబు రాజకీయజీవితాన్ని విభజించవచ్చు.
అవకాశం కోసం వేచి వుండటం లేదా అవకాశాన్ని సృష్టించుకోవడం లేదా ఏపరిస్ధితినైనా అవకాశంగా మలచుకోవడం ఆయన జీవితంలో ప్రతిదశలోనూ కనిపిస్తాయి.
ఎన్ టి ఆర్ ను నాదెళ్ళ భాస్కరరావు ముఖ్యమంత్రి పదవి నుంచి దించేసినపుడు అది అప్రజాస్వామికమనీ, వెన్నుపోటనీ యావత్ దేశం ఖండించింది. చంద్రబాబే ఎన్ టి ఆర్ ను దించేసినపుడు జనబాహుళ్యంలో అంతటి వ్యతిరేకత వెలువడలేదు. దీన్ని ఒక పార్టీ అంతర్గత వ్యవహారంగానే భావించారు. రాజకీయపార్టీల నుంచి మాత్రం ఇప్పటికీ చంద్రబాబు మీద విమర్శలు వస్తూనే వున్నాయి.
వ్యవసాయం దండగమారి అన్నారని చంద్రబాబుని ఇంకా విమర్శిస్తూనే వుంటారు. ఆయన ఆమాట అనకపోయినంత మాత్రాన వ్యవసాయ లాభసాటి వ్యపకమైపోదు కదా! ఇప్పుడు దేశ వ్యాప్తంగా వ్యవసాయ రంగానికి జరుగుతున్నదేమిటి? హైటెక్ బాబు, ప్రచారం బాబు అని విమర్శిస్తూంటారు. 45 ఏళ్ళ యుపి ముఖ్యమంత్రి అభిషేక్ మొదలు 94 ఏళ్ళ తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణా నిధివరకూ ఇపుడు హైటెక్నలజీని వాడని రాజకీయ వేత్త వున్నారా? ప్రచారంకోసం రెండుగంటలకోసారైనా సోషల్ మీడియాలోకి రాని కీలకమైన రాజకీయవేత్తలు వున్నారా? (తొందర పడి ముందే కూసిన కోయిల అన్నట్టు) చంద్రబాబు కూడా పది పదిహేనేళ్ళ ముందే ఈ పనులన్నీ చేసేశారు
అప్పుడు అధికారుల మాట మాత్రమే వినేవారని, ఇపుడు కార్పొరేట్ వర్గాల మాట మాత్రమే వింటున్నారనీ చంద్రబాబు మీద విమర్శలు గట్టిగా వున్నాయి. పార్టీలో విధేయుల్ని బాబు పట్టించుకోరని, నోరున్నవారినే అందలాలు ఎక్కిస్తూంటారని విమర్శ వుంది.
చంద్రబాబు మీద ప్రశంసలకూ, విమర్శలకూ ఆయన బలాలకూ, బలహీనతలకూ, ప్రాధాన్యతలకూ మూలం ఆయన మధ్యతరగతి వర్గ స్వభావమే!
28 ఏళ్ళ వయసులో ఎమ్మెల్యే * 30 ఏళ్ళ వయసులో మంత్రి * 46 ఏళ్ళ వయసులో ముఖ్యమంత్రి * యునైటెడ్ ఫ్రంట్ చైర్మన్ * ప్రధాని అయ్యేందుకు రెండుసార్లు అవకాశాలు * రాజకీయరంగానికి ప్రొఫెషనలిజమ్ ఆపాదించిన మొదటి పొలిటీషియన్ * ఓర్పు, సహనాలు మేళవించుకున్న అవిశ్రాంత రాజకీయ కార్మికుడు *
66 ఏళ్ళ వయసులో కూడా చంద్రబాబు రోజుకి 18 గంటలు పనిచేస్తున్నారు. తెల్లవారుజామున 4గంటలకే నిద్రలేచే చంద్రబాబు యోగాతో తన దిన చర్యను ప్రారంభిస్తారు దినచర్య రాత్రి 12గంటల వరకు కొనసాగుతుంది. ఓ వైపు జిల్లాల పర్యటనలు చేస్తూనే..మరోవైపు విజయవాడలోని క్యాంపు ఆఫీస్లో రివ్యూలు చేస్తూ అధికారులకు దిశా నిర్దేశం ఇస్తుంటారు. 66 ఏళ్ల వయసులో కూడా చంద్రబాబు చాలా యాక్టివ్గా ఉండడానికి ప్రధాన కారణం ఆయన తీసుకునే మితాహారమే. ఉదయం ప్లేటు ఇడ్లీ, మధ్యాహ్నం రెండు పుల్కాలు, పండ్లు, రాత్రిపూట చపాతి, పండ్లతో భోజనాన్ని ముగిస్తారు.
చిత్తూరు జిల్లా నారావారిపల్లెలో నారా ఖర్జురనాయుడు, అమ్మణమ్మల దంపతులకు జన్మించిన చంద్రబాబు..ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదిగి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రెండు సార్లు ముఖ్యమంత్రయ్యారు. ముఖ్యమంత్రిగా ఉన్న తొమ్మిదేళ్ల కాలంలో చంద్రబాబు అనేక సవాళ్లు, ప్రతిసవాళ్లను ఎదుర్కొన్నారు. అయినా వాటన్నింటిని ఒక్కొక్కటిగా అధిగమిస్తూ..పార్టీని ముందుండి నడిపిస్తున్నారు. సాధారణ ఎన్నికలకు ముందు 2,817 కిలోమీటర్ల దూరం పాదయాత్ర చేసి..ముచ్చటగా మూడోసారి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టాంచారు. నవ్యాంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టి రెండేళ్లు కావొస్తుంది. ఈ రెండేళ్ళ కాలంలో కూడా సీఎంగా అనేక సమస్యలు ఎదుర్కొన్నారు. ఇంకా చంద్రబాబు ముందు అనేక సవాళ్లు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి (ఏప్రిల్ 20) పుట్టినరోజు శుభాకాంక్షలు!!