ఒకచేతిలో సంక్షేమాన్ని, ఇంకో చేతిలో అవినీతిని ధరించి కత్తిలా దూసుకుపోతూ ఆకస్మికంగా, అర్ధంతరంగా జీవన ప్రయాణాన్ని ఆపేసిన వై ఎస్ ఆర్ (ఎడుగూరి సందింటి రాజశేఖర రెడ్డి) ‘పాలెగాళ్ళ’ ఆధునిక రూపానికి, ఉదారవాదంలో కాఠిన్యానికి, సంక్షేమం వెనుక ఆశ్రిత పక్షపాతానికీ, విధేయత వెనుక నిరంకుశత్వానికీ, ప్రత్యర్ధికి కంపరమెత్తించే అట్టహాసానికీ చరిత్రలో వెలుగుగానూ చీకటిగానూ కూడా గుర్తుండిపోతారు.
వైఎస్ ని అర్ధం చేసుకోడానికి కాస్త చరిత్రలోకి వెళ్ళాలి. విజయనగర రాజులు తమరాజ్యంలో చెరువులు, దొరువులు, రహదారులు, సత్రాలు, ఇతర ప్రజాహిత కార్యక్రమాల నిర్మాణాలకు, నిర్వహణలకు ప్రాంతాలవారీగా పాలెగాళ్ళను నియమించేవారు. వారు గుత్తేదారులకు (కాంట్రాక్టర్లు) పనులు అప్పగించి కొంత కమీషన్ అందుకుని అందులో కొంత రాజుగారికి బహుమతిగా ఇచ్చేవారు. ప్రజల సభలో ప్రకటించే జమా ఖర్చులకు అదనంగా కొంత సొంత సొమ్ము (బ్లాక్ మనీ) వుంచుకోవలసిన అవసరాన్ని ఏలికలకు అర్ధమయ్యేలా చేసింది పాలెగాళ్ళే…అయితే పాలెగాళ్ళు కేవలం వసూళ్ళ రాజాలేకాదు. మరెవరూ పోటీకిరాకుండా ప్రత్యర్ధి అనుకున్న వాళ్ళను చిదిమేసే యోధులుకూడా. అంతకుమించి తమ బాధ్యతలను జనరంజకంగా నిర్వహించి పేరు తెచ్చుకోవాలన్న కీర్తికామకులు కూడా. రాయలసీమను ఏలిన పాలెగాళ్ళే కాలక్రమంలో ఫ్యాక్షనిష్టులు అయ్యారు.
అలాంటి ఫ్యాక్షనిష్టు వారసత్వాల నుంచి వచ్చిన వై ఎస్ ఆర్ కాంగ్రెస్ లో కార్యకర్త దశనుంచి ముఖ్యమంత్రి అయ్యేవరకూ పునాది మొదలు గృహప్రవేశం వరకూ ప్రతీ దశా సొంత కష్టమే. ఇదంతా మిత్రులను కూడగట్టుకుంటూ తనను తాను తీర్చిదిద్దుకున్న కష్టమే. ముఖ్యంగా పాదయాత్ర కాలంలోనే వైఎస్ అంతర్ముఖంలో పెద్ద రూపాంతరం జరిగింది. ఆయన నిరాడంబరత, నిలబడగలడన్న భరోసా పేదల్ని ఆయనకు దగ్గరగా తీసుకు వచ్చింది. అడుగు మనిషి బడుగు బతుకులో కష్టం ఆయనలో ఒక ఆర్తిగా స్ధిరపడింది. ‘ప్రో పూర్’ ముఖ్యమంత్రిగా వైఎస్ చరిత్రలో మిగిలిపోడానికి మూలం ఆయన చేసిన పాదయాత్రే ననడంలో మరో అభిప్రాయమేలేదు. ”ఈ యాత్ర చేసి వుండకపోతే జస్ట్ ఎగ్జిస్టెన్స్ కోసం (కేవలం బతకడానికి తిండి సంపాదించుకోవడం కోసం) మనుషుల్లో ఇంత పెయిన్ వుందని తెలిసేదికాదు. పాలిటిక్స్ సరే.. వీళ్ళకోసం ఏదైనా చెయ్యాలి” అని ఒక సందర్భంలోఈ జర్నలిస్టుతో వైఎస్ ఆర్ అన్నారు. పాదయాత్రలో తూర్పుగోదావరిజిల్లా మధురపూడి దగ్గర ఆయన సిక్ అయి 12 రోజులపాటు తోటలో వేసిన టెంట్ లో విశ్రాంతి తీసుకున్నారు. అపుడు ఈ జర్నలిస్ట్ చేసిన ఇంటర్యూ తేజా (జెమిని)న్యూన్ టివిలో ప్రసారమైంది.
వైయస్సార్ ముఖ్యమంత్రి అయ్యేసరికి దేశంలో సరళీకృత ఆర్ధిక విధానాలు ముమ్మరంగా అమలవుతున్నాయి. ఇక్కడ మళ్ళీ ఒకసారి వెనక్కి వెళ్ళాలి…కాటన్ ఆనకట్ట కట్టినపుడు పాడిపంటలు పొంగుకొచ్చాయి. అవి సిరి సంపదలయ్యాయి. వాటి నుంచి నిరంతర ఆదాయాలిచ్చే రైస్ మిల్లులు వచ్చాయి. పరిశ్రమలు వెలిశాయి. కొంత చొరవ, కాస్త స్తోమత కలవారే ఈ అవకాశాలను అందిపుచ్చుకుని శ్రీమంతులయ్యారు. సంపదలు కూడగట్టడం ఆకస్మిక పరిణామం కాదు. అందులో శ్రమా, వ్యవధీ వున్నాయి. ఇదే శ్రీమంతులకు ఒక గౌరవం తెచ్చిపెట్టింది.
సరళీ కృత ఆర్ధిక విధానాల కు పుట్టిన వికృత శిశువు క్రోనీ కేపిటలిజం. ఇందులో శ్రమ కష్టం వుండదు. అధికారంలో వున్న వారి ప్రాపకం వుంటే చాలు. వారికి బ్రోకర్ గా వుంటే చాలు ఏ వనరునైనా ఉదారంగా అమ్మేసే అవకాశాన్ని పాలకులకు ఇస్తున్న ఆర్ధిక విధానంలో ”నాకది నీకిది” అని పంచేసుకోవడమే! ఇది ప్రపంచమంతటా వున్నదే! అయితే పైసా పెట్టుబడి లేకుండానే ఖాతాలోకి వచ్చి పడే భూములు, మట్టి పెళ్ళల్ని ముట్టుకోకుండానే సబ్ కాంట్రాక్టుల నుంచి రాలిపడే లాభాలు, ప్రతీ పనినుంచీ వసూళ్ళయ్యే ముడుపుల క్రోనీ కేపిటలిజాన్ని ఈడ్చుకొచ్చి 2జీ స్పెక్ట్రమ్ ద్వారా మన్ మోహన్ సింగ్ ప్రధానిగా ఇండియానీ – వాన్ పిక్, గనులు, ఔటర్ రింగు రోడ్డుల ద్వారా వైఎస్ ఆర్ ముఖ్యమంత్రిగా వున్న ఆంధ్రప్రదేశ్ నూ ప్రపంచంలోనే భ్రష్టు పట్టించారు. అయితే మన్ మోహన్ కి అంటుకోని అవినీతి మచ్చలు వైఎస్ఆర్ ని పూర్తిగా అలుముకున్నాయి. వైఎస్ఆర్ పాటించిన విధానాలవల్ల అడ్డగోలు సంపదలతో రాత్రికి రాత్రే కుబేరులైపోయిన శీఘ్ర శ్రీమంతులు (క్రోనీ కేపటలిస్టులు) ఇపుడు తెలంగాణాలో, ఆంధ్రప్రదేశ్ లో కనీసం 1500 మందైనా వున్నారని అంచనా.
కాంగ్రెస్ పట్ల విధేయత కనబరుస్తూ దాదాపు సర్వ స్వతంత్రంగా వ్యవహరించిన వైఎస్ ఆర్ ఢిల్లీ కి నెలసరి కప్పాలు కట్టేవారన్న గుసగుసల్ని ప్రస్తావించినపుడు ‘బాగా హేండిల్ చేస్తున్నాడు’ అని రాజకీయవాదులు ఆఫ్ ది రికార్డుగా అనేవారు. ప్రజల్లో ప్రజాజీవనంలో వైఎస్ఆర్ పలుకుబడి, ప్రతిష్టల తేజస్సు ముందు ఆయన్ని వేలెత్తి చూపించే స్ధయిర్యం పార్టీ హైకమాండుకి గాని సహచరులకు గాని వుండేదికాదు. మాటలతోగాక చేతలతోనే పార్టీని కట్టడి చేసేవారు. మౌలిక మైన విధినిర్వహణలో వైఫల్యాన్ని సాన్నిహిత్యం క్షమించకూడదన్న రాజనీతిని ఆయన ఎన్నడూ వదలలేదు. జడ్ పి సి సభ్యుల ఓటమికి బాధ్యులుగా ఇద్దరు మంత్రుల్ని రాజీనామా చేయించిన ఆయన కాఠిన్యం సహచరుల వెన్నులో వణుకు పుట్టించింది. శాసనసభలో ప్రతిపక్షనాయకుడైన చంద్రబాబు అదేపనిగా చేసే తెగడ్తలన్నిటినీ వైఎస్ఆర్ ఒకేనవ్వుతో విరిచేసేవారు.
వైఎస్ఆర్ స్మృతిలో గుణ, దోషాలు వెలుగునీడల్లా ఒకదానిని ఒకటి వెన్నంటే వుంటాయి. అయితే డబ్బులేని కారణంగా ఏ ఒక్కరూ అనారోగ్యంతో చనిపోకూడదన్న ఆయన ఆర్తి మానవీయకోణంగా ఆరోగ్యశ్రీ పధకమైంది. పేదల ఆరోగ్యం విషయంలో వైఎస్ అధికారులను నిద్రపోనివ్వలేదు. సీఎం సహాయనిధి ఫైళ్లను ఏ రోజుకు ఆ రోజే క్లియర్ చేసేవారు. ఎంత అర్ధరాత్ర యినా ఫైళ్ళు ఇంటికి తెప్పించుకుని మరీ క్లియర్ చేసేవాళ్ళు. పేదలు లక్షలు పెట్టి వైద్యం చేయించుకోలేరు. వాళ్ళ ప్రాణం అత్యంత విలువైంది. కాబట్టి ఈ విషయంలో అశ్రద్ధ చేయవద్దని స్పష్టమైన ఆదేశాలుండేవి. ఆ కృషే వేలవేల పేదకుటుంబాల్లో కోలుకున్న చిరునవ్వుల్ని పూయిస్తోంది. అనేక ఇతర రాష్ట్రాలకూ పాకింది. ఆంధ్రప్రదేశ్ లో ఈ పధకం పేరు ఎన్టిఆర్ వైద్య సేవలు అని మారినా ప్రజలు మాత్రం ఆరోగ్యశ్రీ అనే పిలుస్తున్నారు. దీన్ని బట్టే వైఎస్ఆర్ ప్రజాహృదయంలో ఎంత లోతున వున్నారో అర్ధం చేసుకోవచ్చు.
మంచి చెడులు కలబోసుకున్న వైఎస్ఆర్ ఆకస్మికంగా మరణించడం వల్ల వెల్లువెత్తిన సానుభూతిని వైఎస్ఆర్ పార్టీ కి రాజకీయమద్దతుగా కొనసాగించుకోగలుగుతున్న ఆయన కుటుంబ వారసుడు వైఎస్ జగన్మోహనరెడ్డి తండ్రిగారి అవినీతికి కూడా వారసుడిగా కేసులను మోస్తున్నారు.
వివాదాస్పద ప్రస్ధానంలో ఒకే వ్యక్తి – ప్రత్యర్ధులకు దెయ్యంలా, అభిమానులకు దేవుడిలా కనబడుతారు. ఆరేళ్ళక్రితం సరిగ్గా ఇదే రోజు సెప్టెంబరు రెండున పావురాల గుట్టలో కూలి ‘పోయిన’ వైఎస్ఆర్ కూడా అంతే…