శేఖర్ కమ్ముల తీసిన ‘హ్యాపీ డేస్’ వచ్చి పదేళ్లు దాటింది. ఎప్పుడో 2007లో ఆ సినిమా విడుదలైంది. కానీ, ఆ సినిమా ప్రభావం ఇంకా దర్శక, నిర్మాతలపై వుందనీ… ‘హ్యాపీ డేస్’ను క్లాసిక్ అని ఎందుకు అంటున్నారనీ… చెప్పడానికి ఈ వారం విడుదలైన నిఖిల్ ‘కిరాక్ పార్టీ’, వచ్చే వారం విడుదలకు సిద్ధమవుతున్న మలయాళం డబ్బింగ్ మూవీ ‘ఆనందం’ చూపించవచ్చు. శుక్రవారం విడుదలైన ‘కిరాక్ పార్టీ’ చూడగానే ప్రేక్షకులకు ‘హ్యాపీ డేస్’ గుర్తు వచ్చింది. ఇదేమి రీమేక్ చేసేంత గొప్ప కథ కాదు, మన దగ్గర వచ్చిన ‘హ్యాపీ డేస్’కు దగ్గరగా వుందనే కామెంట్స్ వినిపించాయి. ఇక, వచ్చే వారం విడుదల కాబోయే ‘ఆనందం’ దర్శకుడు గణేష్ రాజ్, మన దగ్గర మెట్రో ఆడియన్స్ తెగ పొగిడిన ‘బెంగళూరు డేస్’ దర్శకురాలు అంజలీ మీనన్ శిష్యుడు. మలయాళంలో అతడు తీసిన తొలి సినిమా ‘ఆనందం’. అంతా కొత్తవాళ్లతో తీసిన ఈ సినిమా అక్కడ 50 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది. దాన్ని తెలుగులో డబ్ చేస్తున్నారు. ఈ రోజు ఆడియో విడుదల చేశారు. ఆడియో విడుదలకు వచ్చిన దర్శకుడు గణేష్ రాజ్, ‘హ్యాపీ డేస్’ ఇన్స్పిరేషన్ తో సినిమా తీశానని చెప్పాడు. సినిమాకి ‘హ్యాపీ డేస్ అగైన్’ అని కాప్షన్ పెట్టారు. దీన్ని బట్టి శేఖర్ కమ్ముల సినిమా ఎఫెక్ట్ ఏ రేంజ్లో వుందో అర్థం చేసుకోవచ్చు. దటీజ్ శేఖర్ కమ్ముల.