కొన్ని ఆలోచనలు భలే గమ్మత్తుగా వుంటాయి. అయితే ఆలోచనని కథగా రాసి, దానిని రెండున్నగంటల స్క్రీన్ ప్లే గా మలిచి ప్రేక్షకులని రంజింపచేయడానికి పనితనం కావాలి. యువ నటుడు యష్ పూరి “హ్యాపీ ఎండింగ్” ఆలోచన కూడా గమ్మత్తయినదే. మారి ఆ ఆలోచన తెరపైకి ఆసక్తికరంగా వచ్చిందా? వినోదాన్ని పంచిందా?
హర్ష (యష్ పూరి) చిన్నప్పుడే ఓ స్వామీజీ శాపానికి గురౌతాడు. ఆ శాపం ప్రకారం తను శృంగార దృష్టితో చూసిన స్త్రీలు చనిపోతారు. ఓ హీరోయిన్ తో పాటు స్కూల్ టీచర్ ఈ లిస్టులో చేరిపోతారు. దీంతో భయపడిన హర్ష అప్పటి నుంచి ఆ దృష్టిలో చూడటం మానేస్తాడు. హర్ష పెద్దయ్యాక అవని (అపూర్వ రావు) ప్రేమలో పడతాడు. ఒక దశలో పెళ్లి వద్దు అనుకున్న హర్ష కొన్ని పరిస్థితిలో పెళ్లి చేసుకుంటాడు. తర్వాత తనకి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? శాపం నుంచి విముక్తి కలిగిందా? నిజంగా తనపై శాప ప్రభావం ఉందా ? ఇవన్నీ తెరపై చూడాలి.
కొత్త దర్శకులు కొత్త ఆలోచనలు చేస్తున్నారు కానీ ఆలోచని తెరపై యంగేజింగా చెప్పడంలో సరైన పనితీరు కనపరచడంలో తడబడుతున్నారు. ‘హ్యాపీ ఎండింగ్” సమస్య కూడా ఇదే. పురాణాలలోని శాపం నేపధ్యంను తీసుకొని ఓ రొమాంటిక్ కామెడీ తీయాలనేది దర్శకుడు ఆలోచన. ఆలోచన వరకూ బావున్నా.. ఇందులో రొమాన్స్ లేక అటు కామెడీ పుట్టక రుచీపచి లేని ఓ పదార్ధంలా తయారైయింది సినిమా. ఆలోచన పరంగా చూసుకున్నా ఇదొక సిల్లీ కట్టుకథ అనిపిస్తుంది. నిజానికి కథ చెప్పడం కంటే కట్టుకథని జనరంజకంగా చెప్పడానికి చాలా నేర్పు కావాలి. ప్రేక్షకుడు లాజిక్ ని మర్చిపోవాలి. అలా చేయాలంటే రాసుకున్న పాత్రలు, తీసిన సన్నివేశాల్లో మంచి డ్రామా వుండాలి. ఈ సినిమా ఆద్యంతం అలాంటి డ్రామాకి ఆమడదూరంలో సాగింది. ఏ పాత్రలోనూ వినోదం వుండదు. చివరి హీరో హీరోయిన్ పాత్రల్లో కూడా బలం వుండదు. పాపం ఆ హీరో శాపంతో బాధపడుతున్నాడని ప్రేక్షకుడికి ఒక్క సన్నివేశంలో కూడా అనిపించదు.
నిజానికి ఇలాంటి కథలని హిలేరియస్ చెప్పొచ్చు. కానీ దర్శకుడు ఆ ప్రయత్నం చేయలేదు. ఎంతసేపూ యమా సీరియస్ గా ఎదో జరుగుపోతుందనే టైపు.. పాత్రలని నడిపాడు. సినిమాకి కావాల్సిన కొన్ని బేసిక్ లక్షణాలు కూడా ఇందులో చాలా చోట్ల కనిపించవు. ప్రేక్షకులు చూడటానికి ఈ సినిమా తీశారనే సెన్స్ లేకుండా ఇందులో చాలా సన్నివేశాలు నడిచిపోతుంటాయి. ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ అని ప్రత్యేకంగా చెప్పడానికి ఏమీ లేదు. సినిమా చూస్తున్నంత సేపు ఏదో ఒక నిరుత్సాహం ఆవహించిన ఫీలింగ్ కలుగుతుందే తప్పితే తర్వాత సీన్ లో ఏం జరుగుతుందనే ఆసక్తి వుండదు.
ఎత్తుకున్న పాయింట్ కూడా సరిగ్గా న్యాయం జరగదు. దర్శకుడు ఏం చెప్పాలనుకున్నాడో క్లారిటీ వుండదు. సీన్లు కథతో లింక్ వుండవు. డైలాగులు సింక్ అవ్వవు. మోడరన్ టచ్ అనుకున్నారేమో కానీ హీరో, హీరోయిన్లు పేజీల కొద్ది ఇంగ్లీష్ డైలాగులు మాట్లాడేస్తుంటారు. డైలాగులోని ఎమోషన్ సీన్ లో కనిపించదు. కొన్ని స్లో మోషన్ సీన్స్ అయితే లాగ్ కి పరాకాష్టగా వుంటాయి. ఏ పాత్ర జర్నీతో ప్రేక్షకులకు ఒక కనెక్షన్ ఏర్పడదు.
నటన విషయానికి వస్తే యష్ పూరి యూత్ లో క్రేజ్ తెచ్చుకోవడానికి ఎంచుకున్న కథలా అనిపిస్తుంది. అసలు ఇప్పటి యూత్ కి ఎలాంటి కంటెంట్ కనెక్ట్ అవుతుందో యష్ కొంచెం గ్రౌండ్ వర్క్ చేసుకోవాలి. యష్ పాత్రలో అస్సల్ యూత్ కనెక్టివిటీ వుండదు. తన బాడీ ప్రదర్శనపై పెట్టిన శ్రద్ద సబ్జెక్ట్ ఎంపికపై పెట్టాల్సింది. అపూర్వ రావు అందంగా వుంది కానీ ఆ పాత్రలో ఎమోషన్ కూడా కనెక్ట్ అవ్వదు. నాలుక తిరగని పేరుపెట్టుకున్న స్వామిజీ పాత్రలో కనిపించిన అజయ్ ఘోస్ నెత్తినిండా జుట్టుతో కనిపించారు కానీ ఆయన నుంచి నాలుగు సీన్లు రాబట్టలేకపోయారు. ఝాన్సీ పాత్ర అయోమయం. ఆ పాత్రతో ఏం చేయాలని అనుకున్నాడో దర్శకుడికే తెలియాలి. విష్ణుకు సరిపడా పాత్ర కాదిది. మిగతా పాత్రలు అంతంత మాత్రమే.
టెక్నికల్ గా సినిమాలో చాలా పరిమితులు కనిపిస్తాయి. ఓటీటీ ఆడియన్స్ కూడా నిర్మాణ విలువల్ని ఎత్తి చూపే కంటెంట్ ఇది. ఆ సన్నివేశాల సమాహారం చూసి సంగీత దర్శకుడికి ఏం చేయాలో అర్ధం కానట్టుగా వుంది చాలాచోట్ల అలా వదిలేశాడు. కెమరాపనితనం కూడా సోసోగానే వుంటుంది. డైలాగుల్లో బలం లేదు. కేవలం ఐడియా వుంటే చాలనుకుని సెట్స్ పైకి వెళ్ళిపోతే రిజల్ట్ ఎలా వుంటుందో ఈ సినిమా చూసి అర్ధం చేసుకోవచ్చు. చిన్న సినిమాలకు సపోర్ట్ చేయాలనే అందుకుకోరుకుంటారు. కానీ కంటెంట్, పనితీరులో నిజాయితీ కనపరచని కొన్ని సినిమాలు ప్రోత్సహించాలానే ఉత్సాహాన్ని కూడా తగ్గించేస్తాయి. ఇది ఆ కోవకు చెందిన సినిమానే.