తెలుగు360.కామ్ రేటింగ్ : 2.75/5
పెళ్లంటే రెండు కుటుంబాలు, సంప్రదాయాలు, పెట్టిపోతలు, సంగీత్‌లు, చుట్టాలూ… మూడు ముళ్లు, ఏడు అడుగులు. నూరేళ్ల జీవితం.
ఇంతేనా.. ఇంకా ఉన్నాయ్
అమ్మాయిలో ఉండే కన్ఫ్యూజన్లు, అబ్బాయిలో ఉండే గందరగోళాలు.. ఇవి కూడా ఉంటాయ్. దాన్నే పట్టుకున్నాడు దర్శకుడు లక్ష్మణ్ కార్య. ఓ పక్క పెళ్లి సంబరాలు సాగుతుంటే, మరోవైపు అమ్మాయిలో కన్ఫ్యూజన్లు పెరుగుతుంటాయి. ఈ రెండింటినీ ముడి పెట్టి, రెండు గంటల సినిమా తీశాడు. అదే ‘హ్యాపీ వెడ్డింగ్’.
కథ
ఆనంద్ (సుమంత్ అశ్విన్). యాడ్ ఫిల్మ్ మేకర్. సంగీతం అంటే ఇష్టం. క్రికెట్ అంటే మరీ ఇష్టం. వీటన్నింటికంటే అక్షర (నిహారిక)ని ఎక్కువగా ఇష్టపడతాడు. అక్షరకు కన్ఫ్యూజన్లు ఎక్కువ. తనకేం కావాలో తనకే తెలీదు. జీవిత భాగస్వామి విషయంలోనూ తనకు కొన్ని కన్ఫ్యూజన్లు ఎదురవుతాయి. ఆనంద్ చేసిన చిన్న చిన్న తప్పులు.. పెద్దవిగా కనిపిస్తుంటాయి. మున్ముందు తన జీవితం ఎలా ఉంటుందో? అని భయపడుతుంటుంది. అందుకే నిశ్చితార్థం అయిపోయాక.. ‘మనం విడిపోదామా’ అనే ప్రపోజల్ తీసుకొస్తుంది. ఎవరెన్ని తప్పులు చేసినా కూల్‌గా క్షమించే ఆనంద్.. అక్షరకు కూడా మరో అవకాశం ఇచ్చాడా? ఆనంద్ – అక్షర పెళ్లిని ఓ వేడుకలా చేద్దామనుకున్న ఇరు కుటుంబ సభ్యులకూ ఈ విషయం తెలిసిందా? అసలింతకీ ఆనంద్, అక్షరలు మళ్లీ కలుసుకున్నారా, లేదా? అనేదే హ్యాపీ వెడ్డింగ్ కథ.
విశ్లేషణ
నిజానికి ఇదేం కొత్త కథ కాదు. గొప్ప కథ అంతకంటే కాదు. కాకపోతే మన కథ. పెళ్లయితే తమ స్వేచ్ఛ ఏమైపోతుంది? తన ఇష్టాలు ఎక్కడికి పోతాయి? అత్త మామలు ఎలా చూసుకుంటారు? పొద్దెక్కినా పడుకోనిస్తారా, లేదా? – సగటు అమ్మాయిల ఆలోచనలన్నీ ఇలానే సాగుతాయి. అక్షర పాత్ర కూడా ఇలానే ఆలోచిస్తుంది. కాకపోతే.. ఇంకాస్త గట్టిగా. దానికి తోడు.. ఆనంద్‌తో పెళ్లి కుదిరాక, మాజీ బోయ్ ప్రెండ్ టచ్‌లోకి వస్తాడు. తన తప్పులకు `సారీ` చెప్పి దగ్గరయ్యే ప్రయత్నం చేస్తుంటాడు. దాంతో ఎవరు కావాలో తేల్చుకోలేక సతమతమవుతుంటుంది. మరోవైపు వీరిద్దరి పెళ్లి ఘనంగా చేయాలని ఇంట్లోవాళ్లు ఏర్పాట్లలో తల మునకలైపోతుంటారు. సో.. దర్శకుడికి కావల్సిన ఫ్లాట్ ఫామ్ దొరికేసినట్టైంది. అమ్మాయిల తాలుకూ కన్ఫ్యూన్లను సున్నితంగా టార్గెట్ చేస్తూనే సన్నివేశాల్ని రాసుకోగలిగాడు. అటు కుటుంబ వాతావరణం, ఇటు యంగ్ `టచ్`… వీటితో తొలి సగం కూల్‌గా సాగిపోతుంది. ద్వితీయార్థం బండి ఏ స్పీడుతో సాగుతుందో, గమ్యమెటో ఆడియన్ బాగానే క్యాచ్ చేస్తాడు. కాకపోతే… ఎమోషన్లను టచ్ చేయగలిగితేనే ఇక్కడ దర్శకుడు సక్సెస్ అవుతాడు. ఈ విషయంలో… లక్ష్మణ్ సఫలీకృతుడయ్యాడు. అమ్మాయిల ఆలోచనలకు, ఇష్టాలకు విలువ ఇవ్వాలనుకుంటూ, తప్పు చేసినా సరి, విడిచిపెట్టని తండ్రి – కోడల్ని కూతురిగా భావించే అత్తమ్మ – తాను ప్రేమించిన అమ్మాయి కన్ఫ్యూజన్లో తప్పులు చేస్తున్నా, సున్నితంగా ఆమె జీవితంలోంచి తప్పుకోవాలనుకునే అబ్బాయి.. ఒకప్పుడు తనని ప్రేమించిన అమ్మాయి ఇప్పుడు మరొకరికి భార్య అవుతున్నా – మళ్లీ ఓపిగ్గా ఆమె కోసం నిరీక్షించే ఓ మాజీ ప్రియుడు.. ఇలా ఎక్కడ చూసినా ఈ సినిమాలో పాజిటివ్ నెస్ కనిపిస్తుంటుంది. కాకపోతే.. అక్షర పాత్రే ఓ పట్టాన మింగుడు పడకుండా పోతుంటుంది.
ఆనంద్ అంటే ప్రేమ తగ్గే సన్నివేశాలన్నీ సాదా సీదాగానే ఉంటాయి. ఇలాంటి కారణాలకు కూడా… అమ్మాయిలు ఇంత తీవ్రంగా ఆలోచిస్తారా? అనిపిస్తుంటుంది. ఓ దశలో కథానాయిక పాత్ర చిత్రణపై అనుమానాలు వేస్తుంటాయి. ఆమె ఏం ఆలోచిస్తుంది, ఏం మాట్లాడుతుంది? రెండింటికీ పొంతన ఉందా? అనిపిస్తుంది. అత్తింట్లో స్వేచ్ఛ పోతుందని భయపడుతుందా? లేదంటే రెండింటిలో ఎవరిని ఎంచుకోవాలో తెలీక కన్ఫ్యూజ్ అవుతుందా? అనే డౌటు వేస్తుంటుంది. కాసేపు ఆనంద్ లా ఆలోచించి – `నేను చేస్తోంది తప్పు, ఆనందే కరెక్ట్` అని అనుకోగలిగిన అక్షర… ఆ పని ముందే చేసుండొచ్చు కదా? అనిపిస్తుంది. అఫ్ కోర్స్.. అదే జరిగితే.. ఈ కథ ఇంట్రవెల్ రాకుండానే శుభం కార్డు వేసుకుంటుందనుకోండి.. అది వేరే విషయం. హీరో, హీరోయిన్ల క్లాష్ కి బలమైన కారణం లేకపోవడం, సంఘర్షణ పైపై పూతలా కనిపించడం, చాలా సన్నివేశాల్ని మరీ సీరియల్ తరహాలో లాగడం.. ఇవన్నీ ఇబ్బంది పెడతాయి. కాకపోతే.. ఓ క్లీన్ సినిమా తీయాలన్న ఆలోచన, దాన్ని కుటుంబ సమేతంగా చూసేలా తెరకెక్కించిన తీరు ఆకట్టుకుంటాయి.
నటీనటులు
ఇది నిహారిక సినిమా. ఆమె పాత్ర, నటన ఈ కథకు బలం. రెండో సినిమా అయినా, అన్ మెచ్యూర్డ్ పాత్రనే అయినా చాలా మెచ్యూర్డ్‌గా చేసింది. చాలా సహజంగా నటించింది. సుమంత్ అశ్విన్ మాత్రం కాస్త రివర్స్. అతని బాడీ లాంగ్వేజ్‌కి కనెక్ట్ అవ్వడానికి కాస్త సమయం పడుతుంది. ఏ డైలాగ్‌నైనా నవ్వుతూ చెప్పడం తగ్గించుకోవాలి. ఓవర్ ఎక్స్‌ప్రెషన్స్‌ని కంట్రోల్లో పెట్టుకోవాలి. పతాక సన్నివేశాలకు ముందు కథానాయికతోనూ, కథానాయిక తండ్రితోనూ మాట్లాడేటప్పుడు మాత్రమే సుమంత్ నచ్చుతాడు. మురళీ శర్మ, నరేష్‌లకు బాగా నటించడం అలవాటైపోయింది. నరేష్ ఈసారి ఇంకాస్త సహజంగా నటించాడు. అన్నపూర్ణ లాంటి సీనియర్ నటికి ఇంత మంచి పాత్ర దక్కడం ఆనందమే. కాకపోతే.. అలాంటి ఆర్టిస్టుల చేత.. ‘ఏదో చేయమంటే మంగళవారం అన్నాడట’ లాంటి ముతక జోకులు పేల్చడం అవసరమా?
సాంకేతికత
డైలాగులు బాగున్నాయి. ‘మనం ఇచ్చిన ఫ్రీడమ్ అడిగితే చెప్పడానికి కాదు, అడక్కుండానే చెప్పడానికి’, ‘మతం లేని మనిషున్నాడేమో గానీ, గతం లేని మనిషి లేడు’ లాంటి డైలాగులు ఆకట్టుకున్నాయి. కొన్ని చోట్ల సీరియల్ తరహాలో సాగాయి. పాటలు కథలో అంతర్భాగంగా వచ్చాయి. కాకపోతే.. గుర్తుండేలా మాత్రం లేవు. తమన్ అందించిన నేపథ్య సంగీతం సన్నివేశాల్ని ఇంకాస్త ఎలివేట్ చేసింది. కెమెరా వర్క్, ఆర్ట్ పనితనం ఆకట్టుకుంటాయి. దర్శకుడు ఎంచుకున్న పాయింట్ బాగుంది. దాన్ని ఇంకాస్త క్లారిటీతో, డిటైల్డ్‌గా చెప్పాలన్న తపనతో.. స్పేస్ ఎక్కువగా తీసుకున్నాడు. దాంతో.. అక్కడక్కడ స్లో నేరేషన్‌తో ఇబ్బంది పెట్టాడు.
తీర్పు
నవతరం దర్శకుల్లో ఓ మార్పు కనిపిస్తోంది. వాళ్లు కమర్షియల్ ఎలిమెంట్స్‌కి కాకుండా ఎమోషన్స్‌కి ఎక్కువ విలువ ఇస్తున్నారు. ‘హ్యాపీ వెడ్డింగ్’ కూడా ఓ అమ్మాయి తాలుకూ ఎమోషనే. కాకపోతే… దాన్ని ఇంకాస్త బలంగా, అందంగా తీర్చిదిద్దే అవకాశం ఉందనిపిస్తుంది. యువతరం పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి కథ చెప్పినా, దాన్ని యువతరం ఎంజాయ్ చేసేలా మాత్రం చేయలేకపోయాడేమో అనిపిస్తుంది.
ఫైనల్ టచ్: కన్’ఫ్యూజులు’ పోయాయి
తెలుగు360.కామ్ రేటింగ్ : 2.75/5