టీ 20 వరల్డ్ కప్ దగ్గర పడుతోంది. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ టోర్నీ అందుకు వార్మప్‌గా బీసీసీఐ భావిస్తోంది. ఐపీఎల్ ఫామ్ ని బట్టే, భారతజట్టు ఎంపిక జరుగుతుందన్నది బహిరంగ రహస్యమే. అయితే ఈసారి వరల్డ్ కప్‌లో హార్దిక్ పాండ్యా ఆడతాడా? లేదా? అనేది అనుమానంగా మారింది. నిజానికి హార్దిక్ లాంటి ఆల్ రౌండర్ జట్టులో ఉండడం చాలా అవసరం. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ ఇలా మూడు విభాగాల్లోనూ జట్టుకు అండదండగా ఉంటాడు. అయితే ప్రస్తుతం హార్దిక్ పేలవమైన ఫామ్‌లో ఉన్నాడు. మూడు విభాగాల్లోనూ చేతులు ఎత్తేస్తున్నాడు. ముఖ్యంగా బౌలింగ్‌లో తేలిపోతున్నాడు. ధారాళంగా పరుగులు ఇచ్చి, జట్టుకు సమస్యలు తెచ్చి పెడుతున్నాడు. అంతే కాదు, ఇప్పటి వరకూ హార్దిక్ తన పూర్తి కోటా (4 ఓవర్లు) వేయలేదు. హార్దిక్ గాయం నుంచి ఇంకా కోలుకోలేదని, అందుకే పూర్తి స్థాయిలో బౌలింగ్ చేయలేకపోతున్నాడని మాజీలు అభిప్రాయపడుతున్నారు.
అదే నిజమైతే, హార్దిక్‌కు సమస్యలు తప్పవు. అతన్ని కేవలం బ్యాటర్‌గానే జట్టులోకి తీసుకొనేంత వెసులుబాటు లేదు. బౌలింగ్ లో కూడా ఉపయోగపడతాడనే హార్దిక్ ని ఎంచుకొంటారు. బౌలింగ్ వేయకపోతే, హార్దిక్ లాంటి ఆటగాడి అవసరమే లేదన్నది మేనేజ్మెంట్ అభిప్రాయం. ఇటీవల కెప్టెన్ రోహిత్, కోచ్ ద్రావిడ్, సెలక్షన్ కమిటీ పెద్దలు సమావేశం అయ్యారు. హార్దిక్ పాండ్యాని తీసుకోవాలా, వద్దా? అనే విషయంపైనే తర్జనభర్జనలు జరిపినట్టు సమాచారం. ఐపీఎల్ లో చాలామంది యువ ఆటగాళ్లు చక్కని ప్రతిభ చూపిస్తున్నారు. హార్దిక్ స్థానంలో వాళ్ల నుంచి ఒకర్ని ఎంపిక చేసుకోవాలన్నది టీమ్ అభిప్రాయం. రోహిత్ శర్మ కూడా అదే ఆలోచిస్తున్నాడు. హార్దిక్ స్థానంలో శివమ్ దూబే మంచి ఆప్షన్. ఐపీఎల్ లో తన పవర్ఫుల్ హిట్టింగ్తో దూబే అదరగొడుతున్నాడు. అంతే కాదు.. తను పార్ట్ టైమ్ బౌలర్ కూడా. ఫీల్డింగ్‌లోనూ చురుగ్గా ఉంటాడు. ప్రస్తుత ఫామ్ ని బట్టి చూస్తే హార్దిక్ స్థానంలో దూబే వచ్చే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. మిగిలిన మ్యాచ్‌లలో హార్దిక్ రెచ్చిపోయి ఆడితే తప్ప.. అతనికి వరల్డ్ కప్‌లో స్థానం దొరకదు.