ముంబై ఇండియన్స్ యాజమాన్యం రోహిత్ శర్మకీ, అతని ఫ్యాన్స్‌కి గట్టి షాక్ ఇచ్చింది. రోహిత్ ప్లేస్‌లో.. హార్దిక్ పాండ్యాని జట్టుకి కెప్టెన్‌గా నియమించింది. ఇది ఊహించని మార్పే. రోహిత్ సారధ్యంలో ముంబై 5సార్లు ఐపీఎల్ ట్రోఫీని అందుకొంది. ఐపీఎల్ చరిత్రలోని విజయవంతమైన కెప్టెన్లలో రోహిత్ ఒకడు. రోహిత్ ఈసారి కూడా ముంబై పగ్గాలు చేపట్టడం ఖాయం అనుకొన్నారంతా. కానీ… యాజమాన్యం మాత్రం అనూహ్యమైన నిర్ణయం తీసేసుకొంది. భవిష్యత్ ప్రణాళికల్ని దృష్టిలో ఉంచుకొనే ఈ నిర్ణయం తీసుకొన్నట్టు టీమ్ చెబుతున్నా – ఈ నిర్ణయాన్ని రోహిత్ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.
అయితే రోహిత్ ని పక్కన పెట్టడానికి చాలా కారణాలే కనిపిస్తున్నాయి. 2022లో ముంబై జట్టు ప్రదర్శన దారుణంగా ఉంది. కనీసం ప్లే ఆఫ్‌కి కూడా చేరుకోలేకపోయింది. 2023లో ప్లే ఆఫ్ లో వెనక్కి వచ్చేసింది. వరల్డ్ కప్ ఫైనల్ ఓటమి తరవాత.. రోహిత్ కూడా చాలా `లో`లోకి వెళ్లిపోయాడు. అదే సమయంలో హార్దిక్ పాండ్యా నాయకత్వ లక్షణాలపై ముంబైకి గురి కుదిరింది. గుజరాత్ టైటాన్స్‌కి ఓసారి కప్ అందించి పాండ్యా, మరోసారి ఫైనల్ వరకూ తీసుకెళ్లాడు. భారత టీ 20 జట్టుకు నాయకుడిగా సమర్థవంతంగా ముందుకు నడిపిస్తున్నాడు. అందుకే గుజరాత్ నుంచి మళ్లీ హార్దిక్ పాండ్యాని సొంత గూటికి రప్పించుకొంది ముంబై. అయితే హార్దిక్ కి కెప్టెన్సీ పగ్గాలు ఇంత త్వరగా ఇస్తారని ఎవరూ ఊహించలేదు. రోహిత్ తో మాట్లాడే.. అన్ని రకాలుగా ఆలోచించే టీమ్ ఈ నిర్ణయం తీసుకొని ఉంటుంది. కాకపోతే.. రోహిత్ ఇప్పుడు కనీసం ఆటగాడిగైనా కొనసాగుతాడా? అనే అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. గత కొంత కాలంగా రోహిత్ శర్మ టీ 20లపై దృష్టి పెట్టడం లేదు. ఈసారి టీ 20 వరల్డ్ కప్‌లోనూ తను ఆడడం అనుమానమే. అలాంటప్పుడు ఐపీఎల్ మాత్రం ఎందుకు? అనే ప్రశ్న రావొచ్చు. వరల్డ్ కప్ ఫైనల్ ఓటమిని రోహిత్ ఇంకా జీర్ణించుకోలేకపోతున్నాడన్నది వాస్తవం. ఆ బాధ తనని ఇంకా వెంటాడుతూనే ఉంది. 2025లో రోహిత్ అన్ని ఫార్మెట్ల నుంచీ రిటైర్మెంట్ తీసుకొంటాడన్నది ఓ అంచనా. కానీ ముంబై యాజమాన్యం తీరు చూస్తుంటే.. అందరికంటే ముందు ముంబైని రోహిత్ విడిచి పెడతాడేమో అనే అనుమానలు వ్యక్తం అవుతున్నాయి. రోహిత్ లేని ముంబై జట్టుని చూడడం కష్టమే. ఇప్పటికే ముంబై ఇండియన్స్ అఫీషియల్ ట్విట్టర్ ఎకౌంట్ ని రోహిత్ అభిమానులు అన్ ఫాలో చేయడం మొదలెట్టారు. ఐపీఎల్ మొదలయ్యేసరికి ఈ వ్యతిరేకత మరింత ఎక్కువయ్యే ప్రమాదం ఉంది.