తొలి మ్యాచ్‌లో ముంబై జట్టు గుజరాత్ చేతిలో ఓడిపోవడం కంటే, మైదానంలో ముంబై అభిమానులే తమ కెప్టెన్ హార్దిక్ పాండ్యాని హేళన చేయడం… ఎక్కువ చర్చనీయాంశం అయ్యింది. తొలి మ్యాచ్‌లోనే పాండ్యాకి ఇంత పరాభవం ఎదురైతే, సీజన్ అంతా తను కెప్టెన్ గా ఉండగలడా, ఆటగాడిగా తన పూర్తి సామర్థ్యం ప్రదర్శించగలడా? అనేది అనుమానంగా మారింది. ఇది ముంబై జట్టుకు కూడా మంచిది కాదు. అసలు పాండ్యాని కెప్టెన్‌గా నియమించడమే చాలామందికి నచ్చలేదు. ఎప్పుడైతే రోహిత్ శర్మని కెప్టెన్సీ నుంచి తప్పించారో, అప్పుడే ముంబై అభిమానులు తమ నిరసన వ్యక్తం చేశారు. ముంబై ఇండియన్స్ జట్టుని ఒకే రోజు సోషల్ మీడియాలో లక్షమంది అభిమానులు అన్ ఫాలో చేశారు. మైదానంలో రోహిత్ కి బ్రహ్మరథం పట్టి, హార్దిక్ పాండ్యాని గేలి చేశారు. మైదానంలో కుక్క పరిగెడుతోంటే… ‘హార్దిక్.. హార్దిక్’ అంటూ అరవడం…దీనికి పరాకాష్ట.
పైగా హార్దిక్ కూడా గ్రౌండ్ లో చాలా ఓవర్ చేశాడు. రోహిత్ ని బౌండరీ లైన్ దగ్గర ఫీల్డింగ్ కి పెట్డడం, మాటి మాటికీ… తన ఫీల్డింగ్ ప్లేస్ మెంట్ మార్చడం, కొన్ని సందర్భాల్లో దురుసుగా ప్రవర్తించడం ఇవన్నీ అభిమానులు నోటీస్ చేస్తూనే ఉన్నారు. దాంతో పాండ్యాపై ట్రోలింగ్ బాగా పెరిగిపోయింది. మ్యాచ్ ఓడిపోవడం, చివర్లో ముంబైని పాండ్యా గెలిపించకపోవడం మరింత ఆజ్యం పోశాయి. మైదానంలో హార్దిక్ తీసుకొన్న నిర్ణయాల్ని సీనియర్లు కూడా హర్షించలేకపోతున్నారు. తొలి ఓవర్ ని బుమ్రాకి అప్పగించకుండా, హార్దిక్ స్వయంగా వేయడం, ధారాళంగా పరుగులు ఇచ్చుకోవడం విమర్శకుల కారణమైంది. మొత్తానికి ముంబై కెప్టెన్ గా తొలి మ్యాచ్‌లో హార్దిక్‌కు చేదు అనుభవాలు ఎదురయ్యాయి. సొంత అభిమానుల చేతిలో ట్రోలింగ్ అయ్యే కష్టం.. పగవాడికి కూడా రాకూడదు. కాకపోతే… తనకు కెప్టెన్ గా ఇదే తొలి మ్యాచ్ కాబట్టి సర్దుకోవడానికి కొంత టైమ్ తీసుకోవాలి. ముందు సీనియర్ గా రోహిత్ ని గౌరవించాలి. తన సలహాలు పాటించాలి. కెప్టెన్ గా మిగిలిన ఆటగాళ్లని కలుపుకొని ముందుకెళ్లాలి. ఆటగాడిగా రాణించడం పైనా దృష్టి పెట్టాలి. అప్పుడే ముంబై అభిమానుల మనసుల్ని గెలుచుకోగలడు.