ముంబై జట్టుని ఐదుసార్లు ఐపీఎల్ ఛాంపియన్ గా నిలబెట్టిన కెప్టెన్ రోహిత్ శర్మ. యువకులకు పగ్గాలు అప్పగించాలన్న యాజమాన్యం నిర్ణయంతో ఈసారి రోహిత్ శర్మ తప్పుకొని, హార్దిక్ పాండ్యాని కెప్టెన్‌గా మార్చారు. ఈ నిర్ణయం భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకొని తీసుకొన్నదే, అయినా ఎందుకో ముంబై అభిమానులకు నచ్చలేదు. కొంతమంది ఆటగాళ్లు కూడా ముంబై యాజమాన్యం నిర్ణయాన్ని తప్పు పట్టారు. రోహిత్ గొప్ప కెప్టెన్ అని అతన్ని కేవలం ఆటగాడి పాత్రకు పరిమితం చేయడం ముంబైకే నష్టమని హెచ్చరించారు. ఈ నిర్ణయాన్ని అభిమానులూ జీర్ణించుకోలేకపోతున్నారు. దానికి సాక్ష్యమే ఆదివారం జరిగిన ముంబై, గుజరాత్ మ్యాచ్.
ఈ మ్యాచ్ జరిగిన అహ్మదాబాద్ స్టేడియంలో రోహిత్ పేరు మార్మోగిపోయింది. మైదానంలో రోహిత్ పేరుని మంత్రంలా జపించారు. రోహిత్ క్యాచ్ పట్టినా, సింగిల్ తీసినా రోహిత్.. రోహిత్ అంటూ గోల చేశారు. అంతే కాదు. హార్దిక్ పాండ్యాని ఓ సందర్భంలో హేళన చేస్తూ అరిచారు. హార్దిక్ తీసుకొన్న కొన్ని నిర్ణయాలు కూడా కూడా అభిమానులకు రుచించలేదు. రోహిత్ సాధారణంగా సర్కిల్ లో ఫీల్డ్ చేస్తుంటాడు. కానీ హార్దిక్ తనని బౌండరీ లైన్లో నిలబెట్టాడు. సీనియర్ ప్లేయర్లు సలహాలూ, సూచనలు ఇవ్వడానికి బౌండరీ లైన్ నుంచి పరుగెట్టుకొంటూ రావాలి. అది చాలా కష్టం. తోటి ఆటగాళ్లు రోహిత్ సలహాను వినకూడదన్న ఉద్దేశ్యంతోనో ఏమో.. రోహిత్ ని బౌండరీ లైన్ దగ్గర ఫీల్డింగ్‌కు పంపించేశాడు. విచిత్రం ఏమిటంటే.. ఆటగాళ్లు సైతం హార్దిక్ పాండ్యా మాటను లెక్క చేయడం లేదు. ఓ సందర్భంలో బుమ్రా- రోహిత్ తదుపరి బంతి కోసం వ్యూహం పన్నుతుంటే, హార్దిక్ అక్కడికి వెళ్లాడు. అయితే హార్దిక్ సూచనని బుమ్రా పట్టించుకొన్నట్టు కనిపించలేదు. దాంతో పాండ్యా అక్కడి నుంచి అసహనంతో వెళ్లిపోయాడు. రోహిత్ కూడా పాండ్యాని చూపిస్తూ, బుమ్రాతో ఏదో అన్నాడు. అప్పుడు కూడా మైదానం హోరెత్తిపోయింది. దీన్ని బట్టి.. ముంబై టీమ్ లో కెప్టెన్సీ విషయంలో ఏవో లుకలుకలు ఉన్నాయన్న విషయం అర్థమైంది. తొలి మ్యాచ్‌లో రోహిత్ రాణించాడు. కెప్టెన్ పాండ్యా విఫలం అయ్యాడు. లక్ష్య ఛేదనలో ముంబై ఓడిపోయింది కూడా.