కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ చేసిన వ్యాఖ్యలు ఆంధ్రులకు ఎంతగా ఆగ్రహం తెప్పించాయో తెలిసిందే. ప్రత్యేక హోదా ఇవ్వలేమన్నారు. సెంటిమెంటుతో రాజకీయాలు చేస్తే నిధుల కేటాయింపులను ప్రభావితం చేయలేరన్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే… ఆంధ్రులు చేస్తున్న ఆందోళనను ఆయన అవహేళన చేశారు! అందుకే కదా, టీడీపీ మంత్రులతో రాజీనామా చేయించే నిర్ణయం సీఎం తీసుకున్నది. అయితే, ఈ నేపథ్యంలో ఏపీ భాజపా అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు స్పందించారు.
ఆంధ్రప్రదేశ్ కి కేంద్రం ఎలాంటి సాయమూ చేయలేదని అనడం బాధాకరంగా ఉందన్నారు. కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ చేసిన వ్యాఖ్యలకు విపరీతార్థాలు ఎందుకు తీస్తున్నారని ఆయన మండిపడ్డారు. ప్రత్యేక హోదాతో 90 : 10 శాతం నిధులు వస్తాయని మాత్రమే ఆయన చెప్పారన్నారు. అదే స్థాయిలో ప్రయోజనాలు కల్పించేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని జైట్లీ ప్రకటించారని వివరించారు. జైట్లీ తీసుకొచ్చిన మిలిటరీ ఉదాహరణకు తీవ్రంగా స్పందించాల్సిన అవసరం ఏముందన్నారు. ఏపీకి ఇప్పటికే కొన్ని రాయితీలను కేంద్రం ప్రకటించిందనీ, మిగతావి త్వరలో చేస్తున్నామని ఆర్థికమంత్రి ప్రకటించారన్నారు. టీడీపీ మంత్రుల రాజీనామా విషయమై మాట్లాడుతూ.. రాజకీయ అనివార్యతకు లోబడి వారు రాజీనామా నిర్ణయం తీసుకుని ఉంటారని అన్నారు. టీడీపీ మంత్రుల నిర్ణయం నేపథ్యంలో తమ పార్టీ మంత్రులు కూడా రాజీనామా చేసినట్టు వివరణ ఇచ్చారు. నిజానికి, భాజపా మంత్రులు నిన్ననే రాజీనామాలకు సిద్ధమయ్యారు. స్పీకర్ ను సమయం అడిగి, వెంటనే రాజీనామాలు చేసేయండీ అంటూ వారికి ఢిల్లీ నుంచి ఫోన్ చేసింది కూడా హరిబాబే కదా!
ఏదైతేనేం, ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ వ్యాఖ్యల్లో సూక్ష్మాన్ని ఎలా అర్థం చేసుకోవాలో వివరణ బానే ఇచ్చారు. హరిబాబు అనుకుంటున్నట్టుగా.. జైట్లీ వ్యాఖ్యలు అర్థంకాకపోవడం అనేది ఎవ్వరికీ లేదు! ‘ఆంధ్రా ప్రయోజనాలకు ఇంకా కేంద్ర కట్టుబడి ఉందీ, ప్యాకేజీకి కట్టుబడి ఉన్నాం, త్వరలోనే నిధులిస్తాం’ అంటూ ఇప్పటికీ నోటి మాటలకే పరిమితం అవుతున్నారు, అదే అసలు సమస్య. చేతల్లో ఏవీ కనిపించడం లేదన్నది హరిబాబుకు అర్థమౌతోందో లేదో వారే విశ్లేషించుకోవాలి. కేంద్రం అభిప్రాయాలను ఎలా అర్థం చేసుకోవాలో వివరించి టీకా తాత్పర్యాలతో సహా చెబుతున్నారే తప్ప… ఇదే రీతిలో టీడీపీ సర్కారు వాదనేంటో కూడా అర్థం చేసుకునే ప్రయత్నం ఆయన చేస్తే మరింత బాగుంటుంది.