భాజపా రాష్ట్ర అధ్యక్ష పదవికి కంభంపాటి హరిబాబు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అయితే, వెంటనే ఆయనకి కేంద్రమంత్రి పదవి వస్తుందని ప్రచారం జరిగింది. కేంద్రమంత్రి హోదాలోనే ఢిల్లీ నుంచి రాబోతున్నారంటూ ఆయన వర్గీయులు ఆశించారు. అయితే, ఆయన్ని భాజపా కార్యవర్గ సభ్యుడిగా జాతీయ నాయకత్వం నియమించింది. ఒక రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసిన హరిబాబుకి ఇదేమీ గొప్ప పదవేం కాదు. ఉన్నంతలో గౌరవించారనే చెప్పుకోవచ్చు. అయితే, ఈ పదవితోనే సరిపెట్టేస్తారా, మంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉందా లేదా అనే చర్చ కూడా జరుగుతోంది.
ఇప్పట్లో కేంద్ర మంత్రివర్గంలో మార్పులు ఉండే అవకాశం లేవని భాజపా అధ్యక్షుడు అమిత్ షా తాజాగా స్పష్టం చేశారు. ఏదైనా ఉంటే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల తరువాతే అంటున్నారు. ప్రతీదానికీ కర్ణాటక ఫలితాలే డెడ్ లైన్ పెట్టుకుంటున్నారు. ఆ తరువాత విస్తరణ అంటూ ఉంటే హరిబాబుకు కచ్చితంగా అవకాశం ఇస్తారనే ధీమా ఓ వర్గంలో వ్యక్తమౌతోంది. నిజానికి, ఆయన నాలుగేళ్లపాటు భాజపా ఏపీ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించినా.. స్వతంత్రం వ్యవహరించేంత స్వేచ్ఛ భాజపా జాతీయ నాయకత్వం ఇవ్వలేదనే చెప్పాలి. అమిత్ షా ఏది చెబితే అది చెయ్యడం మాత్రమే అన్నట్టుగానే సాగింది. కనీసం, రాష్ట్ర కార్యవర్గంలో తనకు కావాల్సినవారిని హరిబాబు నియమించుకోలేకపోయారు.
చివరికి, ఢిల్లీలో ఏదైనా సమావేశం ఉందంటే అందర్నీ అమిత్ షా ఆహ్వానించేసేవారు. ఢిల్లీ నుంచి పార్టీకి సంబంధించిన సమాచారం ఏదైనా ఉందంటే… అందరికీ ఎంత తెలుసో, హరిబాబుకి కూడా అంతే తెలుసు అన్నట్టుగా ఉండేది. దీంతో హరిబాబు రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నా లేకున్నా పెద్దగా తేడా ఏముందనే అసంతృప్తులు ఆయన వర్గం నుంచే వ్యక్తమయ్యాయి. ఇదే సమయంలో అమిత్ షా కూడా ఏపీ భాజపాలోని మరో వర్గాన్ని… అంటే, హరిబాబుని వ్యతిరేకించే వర్గాన్ని ప్రోత్సహించారనే విమర్శలూ ఉన్నాయి. సో… ఓవరాల్ గా చూసుకుంటే, రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తప్పుకున్నంత మాత్రాన ఆయన కొత్తగా బాధపడేదీ లేదు, కీలక కేంద్రమంత్రి పదవి ఇవ్వకపోయినా కొత్తగా కలిగే అసంతృప్తీ ఏమీ ఉండదనే అభిప్రాయమే ఓ వర్గం నుంచి వినిపిస్తోంది.