పవన్ కల్యాణ్ – క్రిష్ కాంబోలో రూపుదిద్దుకొంటున్న సినిమా ‘హరి హర వీరమల్లు’. ఈ సినిమా ఎప్పుడో పట్టాలెక్కింది. కానీ.. పడుతూ లేస్తూ.. షూటింగ్ సాగించింది. ఇప్పుడు పవన్ పూర్తిగా రాజకీయాలపై దృష్టి సారించడంతో ‘హరి హర వీరమల్లు’ ఆగిపోయింది. మరోవైపు క్రిష్ కూడా అనుష్కతో ఓ కొత్త సినిమా మొదలెట్టేశాడు. ఈలోగా చాలా గాసిప్పులు పుట్టుకొచ్చాయి. ఈ సినిమా దర్శకుడు మారతాడని, క్రిష్ చేతుల్లోంచి మరొకరికి వెళ్లిపోతుందని చెప్పుకొన్నారు. కొందరైతే అసలు ఈ సినిమా వస్తుందా, రాదా? అనే అనుమానాల్లో పడ్డారు. వాటన్నింటికీ ఒకేసారి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది చిత్రబృందం.
ఈ సినిమా షూటింగ్ అయితే ఆగింది కానీ, పనులు మాత్రం సాగుతూనే ఉన్నాయని క్లారిటీ ఇచ్చింది. ప్రస్తుతం వీఎఫ్ఎక్స్ కి సంబంధించిన పనులు ఇరాన్, కెనడా, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‌లలో సాగుతున్నాయని, త్వరలో వీరమల్లు నుంచి ఓ ట్రీట్ రాబోతోందని, తామంతా ఓ మంచి సినిమా కోసం కష్టపడుతున్నామని, అందరి అంచనాలకు మించిన సినిమా ఇస్తున్నామని చిత్రబృందం ఓ స్పెషల్ నోట్ విడుదల చేసింది. దాంతో.. ఈ గాసిప్పులకు చెక్ పెట్టినట్టైంది. పవన్ మళ్లీ షూటింగ్ కి వచ్చేలోగా ఇప్పటి వరకూ జరిగిన షూటింగ్ కి సంబంధించిన ఎడిటింగ్, వీఎఫ్ఎక్స్ లాంటి పనులు చక్కబెట్టుకోనుంది చిత్రబృందం. మరోవైపు క్రిష్ కూడా అనుష్కతో సినిమా పూర్తి చేస్తారు. పవన్ అందుబాటులోకి రాగానే క్రిష్ దర్శకత్వంలోనే ఈ సినిమా షూటింగ్ పునః ప్రారంభిస్తారు.