తెలుగులో సుదీర్ఘ కాలంగా సెట్స్‌పై ఉన్న సినిమాల్లో ‘హరి హర వీరమల్లు’ కూడా ఒకటిగా మిగిలిపోతుందేమో? ఈ సినిమా మొదలై చాలా ఏళ్లయ్యింది. ఇప్పటికీ షూటింగ్ కి శుభం కార్డు పడలేదు. ఈ యేడాది కూడా ఈ సినిమా సెట్స్‌పైనే ఉండిపోబోతోంది. సినిమా ఆగిపోయిందని, దర్శకుడు మారాడని, హీరో కూడా మారిపోతాడని ఇలా రకరకాల రూమర్లు వినిపించాయి. అయితే నిర్మాత ఏ.ఎం.రత్నం మాత్రం ఈ ప్రాజెక్ట్ పై అభిమానుల ఆశలు సజీవంగా ఉంచుతున్నారు. త్వరలోనే వీరమల్లుకు సంబంధించిన ఓ అప్డేట్ ఇస్తామని, ప్రస్తుతం విజువల్ ఎఫెక్ట్స్ కి సంబంధించిన పనులు జరుగుతున్నాయని ఇటీవలే ప్రకటించారు. ఇప్పుడు మరో శుభవార్త చెప్పారు. ‘వీరమల్లు’ పార్ట్ 2 కూడా ఉంటుందని, ఈసినిమాతో పవన్ కల్యాణ్ స్థాయి పెరగబోతోందని ప్రకటించి ఫ్యాన్స్ ని ఖుషీ చేశారు.
ఓ సినిమా కథని రెండు భాగాలుగా విడగొట్టి, పార్ట్ 2గా విడుదల చేసే సంప్రదాయం టాలీవుడ్ కి కొత్తేం కాదు. బాహుబలి నుంచి ఈ ఆనవాయితీ సాగుతోంది. మార్కెట్ పరంగానూ ఇది క్రేజీ ఆలోచనే. ఇప్పుడు వీరమల్లు కూడా అదే దారిలో నడవబోతోందన్నమాట. వవన్‌తో సినిమా చేసి, డబ్బులు సంపాదించుకోవడం అంటే రెండు నెలల్లోనే సినిమాని ముగించేవాడన్నని, పవన్ కెరీర్లో మిగిలిపోయి, ఆయన స్థాయిని పెంచే సినిమా చేస్తున్నాం కాబట్టే ఇంత ఆలస్యం అవుతోందని పవన్ అభిమానులకు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు రత్నం. 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికలు పూర్తవగానే, పవన్ ‘వీరమల్లు’ కోసం కాల్షీట్లు ఇచ్చే అవకాశం ఉంది. ఈ యేడాది చివరి నాటికి ఈ చిత్రాన్ని పూర్తి చేసి 2025 లో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే అవకాశం ఉంది.