హైదరాబాద్: రాజకీయ నాయకుల ఆత్మకథలు సంచలనం సృష్టించటం మామూలే. ఆ నాయకులు గతంలో తమ రాజకీయ జీవితంలోని ఎన్నో రహస్యాలను ఆత్మకథలలో బహిర్గతం చేయటం, అవి సంచలనం సృష్టించటం జరుగుతూ ఉంటుంది. నాడు పీవీ నరసింహారావు మొదలుకొని నిన్న ఫోతేదార్ వరకు ఎందరో నాయకులు ఇలాగే సంచలనాలు సృష్టించారు. తెలుగులో ఆ మధ్య ఎం.ఎస్.రెడ్డి రాసిన ఆత్మకథకూడా ఇలాగే సంచలనం సృష్టించింది. ఎన్టీఆర్, చిరంజీవి తదితరులపై ఆయన సంచలన విషయాలు బయటపెట్టారు. ఆ వివాదం పెద్దదయ్యేటట్లుండటంతో ఎం.ఎస్.రెడ్డి కుమారుడు శ్యామ్ ప్రసాద్ రెడ్డి ఆ పుస్తకాలను మార్కెట్‌నుంచి ఉపసంహరించారు. ఇప్పుడు మాజీ మంత్రి హరిరామజోగయ్య రాసిన ’60 వసంతాల నా రాజకీయ ప్రస్థానం’ పుస్తకంకూడా అలాగే సంచలనం సృష్టిస్తోంది.
తెలుగుదేశం, కాంగ్రెస్ ప్రభుత్వాలలో ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రివంటి ఎన్నో పదవులు నిర్వహించిన చేగొండి హరిరామజోగయ్య తన ఆత్మకథను ఎన్టీఆర్‌కు అంకితమిచ్చారు. ఈ పుస్తకాన్ని బీజేపీ నేత దగ్గుపాటి పురందేశ్వరి నిన్న ఏలూరులో ఆవిష్కరించారు. బీజేపీ నేతలు సోము వీర్రాజు, మాజీ ఎంపీ కావూరి సాంబశివరావు, తెలంగాణ కాంగ్రెస్ నేత జానారెడ్డి, బూరగడ్డ వేదవ్యాస్సహా ఎందరో ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. మరుగున పడిపోయిన వంగవీటి రంగా హత్యగురించి జోగయ్య తన పుస్తకంలో ఎన్నో విషయాలను బయటపెట్టారు. రంగా హత్య జరుగుతుందని – జరగటానికి వారం ముందే తనకు తెలిసిందని, పశ్చిమగోదావరి జిల్లా అత్తిలి ఎమ్మెల్యే దండు శివరామరాజు తనకు ఆ విషయాన్ని చెప్పారని పేర్కొన్నారు. రంగా హత్యను కొందరు ప్రతిపాదిస్తే ఎన్టీఆర్ వద్దన్నారని, ఉపేంద్ర, చంద్రబాబు వారికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని ఆరోపించారు. చిరంజీవి, జగన్, పవన్ కళ్యాణ్‌లపై కూడా జోగయ్య వ్యాఖ్యలు చేశారు. చిరంజీవి తనకున్న జనాకర్షణను ధనాకర్షణకు వాడుకున్నారని, అందుకనే ‘ప్రజారాజ్యం’ పార్టీ ఓడిపోయిందని అన్నారు. రాజకీయపార్టీని నడపగల పరిణతిగానీ, దక్షతగానీ చిరంజీవికి లేవని రాశారు. జగన్ ‘లీడర్’ సినిమాలోలాగా తన తండ్రి సంపాదించిన అక్రమ ఆస్తినంతా ప్రజలకు పంచేస్తే మంచి పేరు వచ్చేదని, అయితే జగన్‌కు అంత మంచి స్వభావం లేదని పేర్కొన్నారు. అతను సలహాలను వినే రకంకాదని అన్నారు. డబ్బున్నవారికే టిక్కెట్ల విషయంలో ప్రాధాన్యం ఇవ్వటంవలనే వైసీపీ ఓడిపోయిందని రాశారు. పవన్ కళ్యాణ్ వలనే 2014లో తెలుగుదేశం ఏపీలో గెలవగలిగిందని, అతను సినిమాలపైకంటే రాజకీయలపై దృష్టి పెడితే బాగుంటుందని పేర్కొన్నారు. అతనికి నిబద్ధత ఉందని రాశారు. అందరికన్నా ఎక్కువ నిజాయతీపరుడుగా ఎన్టీఆర్‌ను, అత్యంత అవినీతిపరుడుగా వైఎస్‌ను పేర్కొన్నారు.
జోగయ్య పుస్తకంపై కలకలం ఇప్పటికే మొదలయ్యింది. రంగా హత్య వెనక చంద్రబాబు ఉన్నారని జోగయ్య చేసిన ఆరోపణలను తెలుగుదేశం ఇవాళ ఖండించింది. గాలి ముద్దుకృష్ణమనాయుడు మాట్లాడుతూ, అది రెండు కుటుంబాలమధ్య గొడవ అన్నారు. ముందే తెలిస్తే ఎందుకు చెప్పలేదని జోగయ్యను ప్రశ్నించారు. మరోవైపు రంగా కుమారుడు రాధా ఇవాళ ఒక మీడియా సంస్థ ప్రతినిధితో మాట్లాడుతూ, జోగయ్య రాసినవన్నీ నిజాలేనని చెప్పారు. తన తండ్రి హత్యకేసుపై పునర్విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. రంగా భార్య రత్నకుమారికూడా హత్యాపాపం చంద్రబాబుదేనని అన్నారు.