ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడుగా వ్యవహరిస్తున్న కంబంపాటి హరిబాబు పదవీ కాలం త్వరలో ముగియనుంది. కనుక ఆ పదవికి మళ్ళీ ఆయననే లేదా సోము వీర్రాజుని కానీ నియమించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. బీజేపీ జాతీయ మహిళా మోర్చ అధ్యక్షురాలు డి.పురందేశ్వరి, రాయలసీమకి చెందిన కె. శాంతా రెడ్డి కూడా ఈ పదవిపై ఆసక్తి చూపిస్తున్నారు. వీరు కాక మరికొందరు కూడా ఈ రేసులో ఉన్నప్పటికీ కంబంపాటి హరిబాబు, సోము వీర్రాజులలో ఎవరో ఒకరిని ఎంపికచేసే అవకాశం ఉందని రాష్ట్ర బీజేపీ నేతలు భావిస్తున్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎవరిని నియమించాలనే విషయంపై బీజేపీ అధిష్టానమే తుది నిర్ణయం తీసుకొంటుంది.
వారిరువురిలో కంబంపాటి హరిబాబు మిత్రపక్షమయిన తెదేపా పట్ల కొంచెం మృదువుగా వ్యవహరిస్తుంటే, సోము వీర్రాజు తెదేపాకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారు. కనుక కంబంపాటి హరిబాబునే చంద్రబాబు నాయుడు సమర్ధించవచ్చును. కంబంపాటి హరిబాబు రాష్ట్ర అధ్యక్షుడిగా సమర్ధంగానే బాధ్యతలు నిర్వహిస్తున్నప్పటికీ వచ్చే ఎన్నికల నాటికి రాష్ట్రంలో బీజేపీని ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా మలచడానికి తగినంత కృషి చేయడం లేదనే భావన పార్టీలో నెలకొనిఉంది.
ఆ కారణంగా ఒకవేళ బీజేపీ అధిష్టానం సోము వీర్రాజును రాష్ట్ర పార్టీ అధ్యక్షుడుగా ఎంపిక చేసినట్లయితే తెదేపా, బీజేపీల మధ్య దూరం పెరుగవచ్చును. సోము వీర్రాజుని ఎంపిక చేసినట్లయితే, వచ్చే ఎన్నికలలోగా తెదేపాతో బంధం తెంచుకోబోతున్నట్లు సూచించినట్లే భావించవచ్చును. సోము వీర్రాజు రాష్ట్ర అధ్యక్షుడుగా ఎంపికయినట్లయితే, అయన రాష్ట్రంలో బీజేపీని బలోపేతం చేసేందుకు గట్టి ప్రయత్నాలు చేయవచ్చును. ఆ ప్రయత్నంలో తెదేపా ప్రభుత్వానికి వ్యతిరేకంగా తన దూకుడును ఇంకా పెంచవచ్చును. ఆ ప్రయత్నంలో తెదేపాను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న పురందేశ్వరి, కన్నా లక్ష్మి నారాయణ, కావూరి సాంభశివరావు తదితరులు ఆయనతో చేతులు కలపవచ్చును. అలాగే వైకాపాతో చేతులు కలిపినా ఆశ్చర్యం లేదు. ఒకవేళ వచ్చే ఎన్నికల నాటికి రాష్ట్రంలో బీజేపీని ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా మలచాలని బీజేపీ అధిష్టానం భావిస్తున్నట్లయితే సోము వీర్రాజుకే రాష్ట్ర అధ్యక్ష పదవి కట్టబెట్టవచ్చును. వచ్చే ఎన్నికలలో కూడా తెదేపాతో కలిసి పోటీ చేయాలనుకొనే మాటయితే మాత్రం సోము వీర్రాజుని ఎంపిక చేయకపోవచ్చును.