హారిక హాసిని సంస్థలో నందమూరి బాలకృష్ణ ఓ సినిమా చేయాల్సివుంది. అన్నీ కుదిరితే.. `అయ్యప్పయుమ్ కోషియమ్` రీమేక్లోనే ఆయన చేసేద్దురు. కానీ కుదర్లేదు. కానీ బాలయ్య ఇచ్చిన కాల్షీట్లు మాత్రం ఆ సంస్థ దగ్గర ఉన్నాయి. అందుకే బాలయ్య కోసం ఓ కథ సిద్ధం చేసే పనిలో పడింది హారిక – హాసిని. అందుకోసం బడా రైటర్లతో సంప్రదింపులు జరుపుతోందని టాక్. బాలయ్య ప్రస్తుతం `అఖండ` తో బిజీ. ఆ తరవాత…. గోపీచంద్ మలినేని సినిమా ఉంటుంది. ఇది ఈ యేడాదే మొదలైపోతుంది. హారిక – హాసిని సినిమా 2022లో మొదలవుతుంది. అయితే ఈలోగా కథ లాక్ చేసుకోవాలన్నది హారిక హాసిని సంస్థ ఆలోచన. అయితే హారిక ముందున్న సమస్య ఒకటే. బాలయ్యను డీల్ చేయడానికి సరైన దర్శకుడు లేడు. బడా దర్శకులంతా వాళ్ల వాళ్ల ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. కొత్త దర్శకుడికి ఛాన్స్ ఇచ్చి – రిస్క్ చేసేంత ధైర్యం హారికకు లేదు. ముందు కథ ఒకటి సెట్ చేసుకుంటే, ఆ తరవాత దర్శకుడ్ని వెదుక్కోవచ్చనేది వాళ్ల ప్లాన్. అందుకే.. యువ రచయితలు, సీనియర్ రచయితలు, ఫామ్ లో ఉన్న రచయితలు… ఇలా అందరి దగ్గరా బాలయ్యకు సరిపడా కథ గురించి వాకబు చేస్తున్నారు. పరుచూరి బ్రదర్స్ దగ్గర బాలయ్య కు సరిపడా ఒకట్రెండు కథలున్నాయి. మరి వాటిలో ఏదైనా ఒకటి సెట్ అవుతుందేమో చూడాలి.