సూపర్ ఫాస్ట్ గా వంద సినిమాలు పూర్తి చేయాలనే లక్ష్యం పెట్టుకున్న పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఓటీటీలోకీ అడుగుపెట్టింది. ఆ బ్యానర్ లో నిర్మించిన వెబ్ సిరిస్ ‘హరికథ’. క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ వెబ్ సిరిస్ హాట్ స్టార్ వేదికగా రిలీజ్ అయ్యింది. శ్రీమహావిష్ణువు దశావతారలు బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ఈ సిరిస్ ప్రేక్షకులకు ఎలాంటి థ్రిల్ ఇచ్చింది? పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఓటీటీ కంటెంట్ లో మార్క్ క్రియేట్ చేసిందా?
అది1980లో అరకు ప్రాంతం. రంగాచారి (రాజేంద్ర ప్రసాద్) కుటుంబానికి నాటకమే ఉపాధి. తన బృందంతో దశావతార ఘట్టాలకు సంబంధించి ఒక్కోరోజు ఒక్కో నాటకాన్ని ప్రదర్శిస్తూ ఉంటాడు. ఆయన ఏ అవతారం గురించి నాటకాన్ని ప్రదర్శిస్తాడో, ఆ అవతారం నేపధ్యంలోనే ఆ వూర్లో ఒకొక్క వ్యక్తి అతి దారుణంగా చంపబడుతూ ఉంటాడు. నృసింహ అవతారం వచ్చి ఓ వ్యక్తిని చంపడం ఓ గ్రామస్తుడి కంటపడుతుంది. దీంతో దేవుడే వచ్చి చంపుతున్నాడని ఆ ఊరి ప్రజలు నమ్ముతారు. ఈ కేసుని విచారిస్తున్న భరత్ (అర్జున్ అంబటి) కూడా అంతు చిక్కని తరహాలోనే చనిపోతాడు. ఈ హత్యలు వెనకున్న రహస్యాలని మరో పోలీస్ ఆఫీసర్ విరాట్ (శ్రీకాంత్) ఎలా వెలికితీశాడు? అసలు ఈ హత్యలకు కారణం ఏమిటి? నిజంగా దేవుడే చంపుతున్నాడా? లేదా ఏదైనా అదృశ్య శక్తి ఉందా అనేది మిగతా కథ.
ఈమధ్య డివైన్ టచ్ వున్న కథలు ప్రేక్షకులని ఆకర్షిస్తున్నాయి. అలాంటి కాన్సెప్ట్, బ్యాక్ డ్రాప్ తో కథలు రాయడాని ఆసక్తి చూపిస్తున్నారు ఫిల్మ్ మేకర్స్. హరికథ కూడా డివైన్ కాన్సెప్ట్ తోనే తయారైయింది. కాన్సెప్ట్ పరంగా ఇది బలమైన పాయింటే కానీ దీనికి ముడిపెట్టిన మూలకథ మాత్రం పరమ రొటీన్.
ఆరు ఎపిసోడ్స్ వున్న సిరిస్ ఇది. దాసు అనే పిల్లాడికి జైలు శిక్షపడే కోర్ట్ ఎపిసోడ్ తో కథ మొదలౌతుంది. తర్వాత విరాట్ (శ్రీకాంత్) పై జరిగిన దాడి ఘటన, ఆ తర్వాత అరకులో వరుస హత్యలు.. నిజానికి ఈ మూడు లేయర్స్ కి బలమైన ముడి ఉంటుందా? అనే ఆసక్తి తొలి ఎపిసోడ్ లో క్రియేట్ అవుతుంది. కానీ హరికథ గమనం ముందుకు వెళుతున్న కొద్దీ కొత్త సీసాలో పాత సారాలా తయారౌతుంది.
వెబ్ సిరిస్ కి ఒక సెపరేట్ గ్రామర్ వుంటుంది. సినిమాలా దిమ్మతిరిగిపోయే బ్యాంగర్ తో మొదలుపెట్టాల్సిన అవసరం లేదు. ఒక క్యారెక్టర్ ని తీసుకొని నింపాదిగా ఆ క్యారెక్టర్ జర్నీతో ప్రేక్షకుడిని లీనం చేయించే వెసులుబాటు వెబ్ సిరిస్ కి వుంది. కానీ హరికథలో ఇలాంటి అర్గానిక్ ట్రీట్మెంట్ వుండదు. ఒకటే ఎపిసోడ్ లో మూడు ట్రాకులు, అనేక పాత్రలు, హత్యలు.. ప్రేక్షకుడి మీదకు దూసుకోస్తాయి. ఈ ట్రీట్మెంట్ థ్రిల్ ఇవ్వకపోగా తికమక పెడుతుంది. శ్రీమహావిష్ణువు దశావతారల బ్యాక్ డ్రాప్ బావున్నప్పటికీ డివైన్ టచ్ పేరుతో ఓవర్ లిబర్టీ తీసుకున్నారు. కొన్ని హత్యలకు లాజిక్ వుండదు. కుల వివక్ష కథలో సింక్ అవ్వదు. ఈ హత్యలు వెనుక అసలు కారణం తెలిసిన తర్వాత మరీ ఇంత రొటీన్ గా అలోచించారేంటి? అనే ఫీలింగ్ కలుగుతుంది.
రాజేంద్రప్రసాద్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పూర్తి నిడివి వున్న క్యారెక్టర్ పడింది. తన అనుభవంతో క్యారెక్టర్ ని పండించే ప్రయత్నం చేశారు. అయితే ఆయన క్యారెక్టర్ ఆర్క్ ని ఇంకా పటిష్టంగా డిజైన్ చేయాల్సింది. ఆయనే కాదు ఇందులో వుండే దాదాపు క్యారెక్టర్స్ అంత బలంగా కనిపించవు. శ్రీకాంత్ క్యారెక్టరైజేషన్ కి జస్టిఫికేషన్ కొరవడింది. అర్జున్ అంబటి పాత్ర కూడా అసంపూర్ణంగానే వుంటుంది. ఇందులో పగ తీర్చుకునే ఓ క్యారెక్టర్ వుంది. ఆ పాత్ర నటన ఓవర్ డోస్ అయ్యింది. పూజిత పొన్నాడ, దివి పర్వాలేదనిపిస్తారు.
సురేష్ బొబ్బిలి నేపధ్య సంగీతం డీసెంట్ గా వుంది. ఉలగనాథ్ కెమరాపనితనం బావున్నప్పటికీ సీజీలో తీసిన చాలా సన్నివేశాలు అర్టిఫీషియల్ గా అనిపిస్తాయి. ఆర్ట్ వర్క్ లో కూడా సహజత్వం కొరవడింది. మాటల్లో కొత్తదనం కనిపించలేదు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై వచ్చిన సిరిస్ ఇది. నిర్మాణ విలువలు విషయానికి వస్తే.. కొన్ని చోట్ల ప్రొడక్షన్ పకడ్బందీగా వుంటుంది. ఇంకొన్ని చోట్ల ఏదో చూట్టేసినట్లుగా అనిపిస్తుంది. కాన్సెప్ట్ ఉన్నపటికీ ట్రీట్మెంట్, మూలకథలో కొత్తదనం లేకపోతే ప్రేక్షకుడు బోర్ ఫీలౌతాడు. ‘హరికథ’లో కూడా ఇదే జరిగింది.