నందమూరి హరికృష్ణ మళ్ళీ చాలా రోజుల తరువాత వార్తలలోకి వచ్చారు. తిరుపతిలో నిన్న మొదలైన మహానాడు సమావేశాలకు ఆయన హాజరు కాలేదు. తన తండ్రి స్వర్గీయ ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఆయన తన కుమారులు కళ్యాణ్ రామ్, తారకరత్నలతో కలిసి హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ వద్దకు వెళ్లి నివాళులు అర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, “మహానాడు సమావేశానికి హాజరు కావడం కంటే ఇక్కడ ఎన్టీఆర్ కి నివాళులు అర్పించడమే చాలా గొప్ప విషయమని భావిస్తున్నాను. తెదేపా నేతలు, కార్యకర్తలు, ప్రజలు అందరూ కలిసి రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం పోరాడి సాధించుకోవాలి. తెదేపా నేతలు, కార్యకర్తలు అందరూ ఆయన ఆశయ సాధన కోసం కృషి చేయాలి. అదే ఆయనకు మనం అందించే గొప్ప నివాళి అవుతుంది,” అని అన్నారు.
తెదేపాలో అందరి కంటే సీనియర్ నేత అయిన హరికృష్ణ తన ఆవేశం, అనాలోచిత నిర్ణయాల కారణంగా చంద్రబాబు నాయుడుకి ఆగ్రహం కలిగించినప్పటి నుంచి వారి మద్య దూరం పెరిగింది. ఆ తరువాత హరికృష్ణ స్వయంగా రాజీకి ప్రయత్నించినా చంద్రబాబు ఆయనని పట్టించుకోలేదు. అప్పటి నుంచి వారి మద్య ఆ దూరం అలాగే నిలిచిపోయింది. పార్టీలో హరికృష్ణ ప్రాధాన్యం క్రమంగా తగ్గిపోవడంతో ఆయన కూడా పార్టీకి దూరంగానే ఉంటున్నారు. ఆయన మళ్ళీ రాజ్యసభ సీటు ఆశించినప్పటికీ చంద్రబాబు ఆయన అభ్యర్ధనని పట్టించుకోలేదని సమాచారం. బహుశః అందుకే ఆయన మహానాడు సమావేశాలకి హాజరు కాలేదేమో. మహానాడుకి హాజరవడంకంటే స్వర్గీయ ఎన్టీఆర్ కి నివాళి అర్పించడమే గొప్ప విషయం అని చెప్పడం ఎన్టీఆర్ ఆశయాలను గాలికొదిలి అట్టహాసంగా మహానాడు సమావేశాలు నిర్వహిస్తున్నారని అక్షేపిస్తున్నట్లే భావించవచ్చు. ప్రత్యేక హోదా గురించి అసంతృప్తి వ్యక్తం చేయడం కూడా అందుకే. ఆ విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అశ్రద్ద వహిస్తున్నారని హరికృష్ణ చెప్పకనే చెప్పారు. అయితే ఇప్పుడు తెదేపాలో హరికృష్ణ గోడు వినే నాధుడే లేడు. ఆయన మాటకి తెదేపాలో విలువే లేదు. తన తండ్రి స్థాపించిన పార్టీలోనే తనకి ఇటువంటి పరిస్థితి వస్తుందని ఆయన ఎన్నడూ ఊహించి ఉండరు. ఆయన ఆవేదన సహేతుకమే కానీ స్వర్గీయ ఎన్టీఆర్ కే పార్టీలో ఇంతకంటే ఘోర అవమానం జరిగినప్పుడు ఇంకా హరికృష్ణ ఎంత?