టీడీపీ హయాంలో కాపు రిజర్వేషన్ల పేరుతో హడావుడి చేసిన.. ముద్రగడ పద్మనాభం ఇప్పుడు వైదొలిగారు. తనను తిడుతున్నారని ఆయన ఫీలయ్యారు. ఆయన స్థానంలోకి ఇప్పుడు జనసేన నేత చేగొండి హరిరామ జోగయ్య వచ్చేందుకు నిర్ణయించారు. ప్రత్యేకంగా కాపు సంక్షేమ సేన ఏర్పాటు చేసి రిజర్వేషన్ సాధనకు ప్రయత్నించాలని నిర్ణయించారు. ప్రభుత్వం కాపులను ఘోరంగా మోసం చేస్తోందని.. గత ప్రభుత్వం ఇచ్చిన ఐదు శాతం రిజర్వేషన్లు కూడా రద్దు చేసి… సంక్షేమ పథకాల్లో మాయలు చేస్తూ… వంచిస్తోందని జోగయ్య అంటున్నారు. అందుకే… రిజర్వేషన్ సాధన లక్ష్యంగా.. కాపుల కోసం… పోరాటం చేయడానికి కొత్త వేదికను సిద్ధం చేశారు.
జోగయ్య చాలా సీనియర్ నేత. ఆయనకు వయసు కూడా పెద్దగా సహకరించదు. అయితే జోగయ్య తాను ప్రత్యక్ష కార్యాచరణలోకి రాకుండా.. తన అనుభవాన్ని ఉపయోగించి.. యువ నేతల్ని ముందు పెట్టి.. ఉద్యమాన్ని నడిపించాలని అనుకుంటున్నారు. ఇందు కోసం.. వివిధ రంగాల్లో పేరు తెచ్చుకున్న ప్రముఖుల్ని ఆయన సెలక్ట్ చేసుకున్నారు. ప్రజా ఉద్యమాల్లో ముందున్న కొంత మంది యువకుల్ని కూడా తెరపైకి తెచ్చారు. వీరందరితో కలిసి ఓ బృందంగా ఏర్పడి.. రిజర్వేషన్ ఉద్యమాన్ని అట్టడుగు స్థాయి నుంచి పైకి తీసుకెళ్లాలని నిర్ణయించారు.
అయితే జోగయ్య కాపుల్లో ఐక్యత తేగలరా అన్న అనుమానం మాత్రం అందరిలోనూ ఉంది. పదవులకు ఆశ పడి.. ఉద్యమంలో ఉన్న వారే మధ్యలో అధికార పార్టీకి తొత్తులుగా మారిపోతున్న ఘటనలు తరుచుగా జరుగుతున్నాయి. ముద్రగడ ఇష్యూలో అదే జరిగింది. వైసీపీతో సన్నిహితంగా ఉన్న ముద్రగడ.. కాపుల ఆశల్ని నెరవేర్చాల్సింది పోయి… భిన్నంగా మాట్లాడారు. ఆయన కుటుంబానికి ప్రభుత్వ వైపు నుంచి పెద్ద ఎత్తున ఆర్థిక ప్రయోజనాలు కలిగాయని… అందుకే ఆరోపణలు వస్తున్నాయి. జోగయ్యకు ముద్రగడ ఉద్యమం మైనస్సే. తాను నమ్మకం కలిగించి.. కాపులను ఐక్యం చేయాల్సిన అవసరం ఉంది. కానీ అది సాధ్యమేనా అన్నది అసలు ప్రశ్న..!