భారత రాష్ట్ర సమితి ఇప్పుడు అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. పార్టీని ఎలా గాడిలో పెట్టాలో తెలియడం లేదు. కేసీఆర్ బయటకు రావడం లేదు.కేటీఆర్ మాత్రం తిరుగుతున్నారు. కవిత మెల్లగా తన జోక్యం పెంచుకునేలా చేసుకుంటున్నారు. ఇప్పుడు హరీష్ రావు తన ప్రయత్నం తాను చేయబోతున్నారు. పాదయాత్ర చేయాలని నిర్ణయించుకున్నారు. అయితే హరీష్ రావుకు.. రాష్ట్రవ్యాప్తంగా యాక్సెస్ లేదు. ఆయనకు ఉమ్మడి మెదక్ జిల్లా వరకూ యాక్సెస్ ఉంది. అక్కడే పాదయాత్ర చేయబోతున్నారు.
ఉమ్మడి మెదక్ జిల్లాలో పార్టీని కాపాడుకునే ప్రయత్నం
ఉమ్మడి మెదక్ జిల్లా బీఆర్ఎస్కు కంచుకోట. అయితే ఇటీవల ఆ కంచుకోటకు బీటలు పడ్డాయి. చివరికి మెదక్ ఎంపీ సీటును కూడా కోల్పోయారు.తన రాజకీయ జీవితంలో ఎదురు దెబ్బలు చాలా తక్కువగా తిన్న హరీష్ రావుకు ఇవి సవాళ్లే. ఇప్పుడు ఆయన మళ్లీ మొదటి నుంచి ప్రారంభించాలని అనుకుంటున్నారు. అందులో భాగంగా పాదయాత్రకు సిద్దమయ్యారు. సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల ప్రాజెక్టుల పనులను పూర్తి చేయాలనే డిమాండ్ పాదయాత్ర చేయాలని నిర్ణయించుకున్నారు.
కేసీఆర్ హయాంలోనే శంకుస్థాపన – కానీ పనులు నిల్
2022 ఫిబ్రవరి 21న నారాయణఖేడ్‌లో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. కానీ పనులు చేపట్టలేదు. ఇటీవల తననుకలిసిన నేతలతో ఈ ప్రాజెక్టుల ప్రస్తావన కేసీఆర్ తెచ్చారు. దీంతో వెంటనే హరీశ్‌రావు పాదయాత్రకు సిద్ధమయ్యారు. ప్రతి రోజూ సుమారు 18 నుంచి 20 కిలోమీటర్ల మేర యాత్ర చేసి.. నారాయణఖేడ్, అందోల్, సంగారెడ్డి, జహీరాబాద్ నియోజకవర్గాలను చుట్టేయనున్నారు.
బీఆర్ఎస్ గెలిస్తే కేసీఆరే సీఎం అంటున్న హరీష్ రావు
హరీష్ రావు మళ్లీ యాక్టివ్ అయితేనే మంచిదని కేసీఆర్‌కు తెలుసు. అయితే అది కేటీఆర్ కు అడ్డం రానంత వరకూ ఆయన ప్రోత్సహిస్తారు. ఇప్పుడు పరిస్థితుల్లో పార్టీ బలోపేతం ముఖ్యం కనుక.. ఉమ్మడి మెదక్ జిల్లా మొత్తం హరీష్ రావుకు పూర్తి స్వేచ్చ ఇచ్చారు. తర్వాత సీఎం కేసీఆర్ అని మాటకు తావులేదని చెబుతూ.. హరీష్ కూడా ఆ బాధ్యతల్ని నెత్తికెత్తుకున్నారు.