హరీష్ రావును కార్నర్ చేస్తున్నారో లేకపోతే నిజంగానే మంచోడంటున్నారో తెలియడం లేదు కానీ.. ఆయన ఇప్పుడు అందరికీ మంచోడే. రేవంత్ రెడ్డి.. బండి సంజయ్ సహా అందరూ ఆయనకు సర్టిఫికెట్ ఇస్తున్నారు. ఆయన మంచి రాజకీయ నేత అంటున్నారు. ఎందుకిలా అంటున్నారో బీఆర్ఎస్ నేతలకు లీలగా అర్థమవుతోంది. కానీ అది కాదేమో అని మళ్లీ సర్ది చెప్పుకుంటున్నారు. కానీ వారిలో హరీష్ రావుపై ఏదో మూల అనుమానం ప్రారంభణవుతోంది.
హరీష్ రావు చాలా మంచోడని బండి సంజయ్ తాజా గా కితాబిచ్చారు. ఆయన బీజేపీలోకి రావాలంటే రాజీనామా చేసి రావాలని అన్నారు. అసలు హరీష్ రావు బీజేపీలోకి ఎందుకు వస్తాడు అంటే.. కొద్ది రోజులుగా సోషల్ మీడియా పుకార్లు రేపుతున్నారు. హరీష్ రావు జంపింగ్ జాబితాలో ఉన్నారని చెప్పుకుంటున్నారు. అటు రేవంత్ రెడ్డి కూడా హరీష్ రావును విమర్శించడం లేదు. కేసీఆర్ చివరికి హరీష్ రావును మోసం చేస్తారని.. ముందే వేరే దారి చూసుకోవాలని సలహాలిస్తున్నారు. హరీష్ పై రేవంత్ కు ఇంత అభిమానం ఉందా అని ఇతరులు ఆలోచించాల్సిన పరిస్థితి.
అయితే హరీష్ రానువు పొగుడుతున్నట్లుగా చేస్తున్నరాజకీయంతో ఆయనకు బీఆర్ఎస్ లో చేటు లేకుండా చేయాలన్న రాజకీయ వ్యూహం ఉందని ఎక్కువ మంది అనుమానిస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీకి ఎలా లేదన్నా ఆయన పిల్లర్ లాంటి వారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో బీఆర్ఎస్ నాయకత్వంలో హరీష్ పై మరింత అనుమానాలు రేగేలా చేస్తే… క్రమంగా అది పెరిగి పెద్దదవుతుందని. ఓ పిల్లర్ కూలిపోతుందన్న వ్యూహంతోనే ఈ రాజకీయం చేస్తున్నారని ఎక్కువ మంది భావిస్తున్నారు.
నిన్నామొన్నటి దాకా హరీష్ రావు ఈ రాజకీయాల్ని ధీటుగానే ఎదుర్కొన్నారు. కానీ ఇప్పుడు ఆయన కూడా ఒత్తిడికి గురవుతున్నారన్న అభిప్రాయం వినిపిస్తోంది. కానీ ఈ రాజకీయాల్ని ఎదుర్కొనే సామర్థ్యం ఆయనకు ఉందని ఆయన అనుచరులు గట్టిగా నమ్ముతున్నారు.