టీఆర్ఎస్ ప్లీనరీలో అంతా కేటీఆర్ షో నడిచింది. బయట మొత్తం ఫ్లెక్సీలు కేసీఆర్‌వి ఉంటే.. లోపల హడావుడి మొత్తం కేటీఆర్‌దే. ప్లీనరీలో ఆయనకు ప్రమోషన్ ఇస్తూ ఓ నిర్ణయం తీసుకున్నారు. అందుకే విపక్షాలు అంతా ఆయ్యా – కొడుకు షోనేనా అని విమర్శలు చేస్తున్నారు. ఉద్యమకారులు.. హరీష్ రావు, కవిత వంటి వారు ఎక్కడ అని ప్రశ్నిస్తున్నారు. ఇది కూడా చర్చనీయాంశం అవుతోంది.
హుజురుబాద్ ఉపఎన్నికల ఇంచార్జ్‌గా ఉన్న హరీష్ రావును ప్లీనరికీ రావొద్దని కేసీఆర్ చెప్పారు. అక్కడే ఉండి పనులు చూసుకోవాలన్నారు. దాంతో హరీష్ రావు హుజురాబాద్‌కే పరిమితమయ్యారు. కానీ కవితకు మాత్రం ఎమ్మెల్సీ హోదాలో ఆహ్వానం ఉంది . ఆమె కూడా హైదరాబాద్‌లోనే ఉన్నారు. దుబాయ్‌లో బుర్జ్ ఖలీఫాపై బతుకమ్మ సంబరాలను నిర్వహించి తిరిగి వచ్చారు. కానీ ఆమె మాత్రం హాజరు కాలేదు. జ్వరంగా ఉండి వెళ్లలేదని ఆమె వర్గీయులు ప్రచారం చేస్తున్నారు.
కొంత కాలంగా కవిత కుటుంబపరమైన కార్యక్రమాలకు.. ముఖ్యంగా కేటీఆర్‌తో ఎలాంటి కార్యక్రమాలకు హాజరు కావడం లేదు. నమస్తే తెలంగాణలో ఆమెకు సరిగ్గా కవరేజీ కూడా రావడం లేదు. ఆమె హుజురాబాద్లోటీఆర్ఎస్ కోసం ప్రచారం చేసిన విషయం కూడా చాలా మందికి తెలియదు. ఈ కారణంగానే టీఆర్ఎస్లో ఏదో జరుగుతోందన్న అభిప్రాయం మాత్రం ఆ పార్టీలో వ్యక్తమవుతోంది. కొన్ని అంశాల్లో సోదరుడు కేటీఆర్‌తో కవితకు సరిపడటం లేదని చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది.