దుబ్బాక అసెంబ్లీ ఉపఎన్నికల్లో హరీష్ రావు ఆగ్రహం అంతా బీజేపీనే కనిపిస్తోంది. ఆ పార్టీ నేతలు క్షేత్ర స్థాయిలో చేస్తున్న ప్రచారం కాదు… సోషల్ మీడియాలో చేస్తున్న ప్రచారంపైనే హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రచారం రేంజ్ ఎలా ఉందంటే.. చివరికి ఆయన సవాళ్లు చేస్తున్నారు. సోషల్ మీడియాలో చేస్తున్న ప్రచారాన్ని దమ్ముంటే తన వద్దకు వచ్చి నిరూపించాలని అంటున్నారు. తాను దుబ్బాకలోనే ఉన్నానని ప్లేస్ చెబుతున్నారు. దీనంతటికి కారణం… బీజేపీ సోషల్ మీడియా.. ఆయనపై వ్యక్తిగత రూమర్స్ ప్రచారం చేయడం లేదు. టీఆర్ఎస్ అమలు చేస్తున్న పథకాల్లో… కేంద్ర నిధులు ఉన్నాయని ప్రచారం చేస్తున్నారు.
బీడీ కార్మికులకు ఇచ్చే పెన్షన్‌లో రూ. పదహారు వందలు కేంద్రం ఇస్తోందని బీజేపీ ప్రచారం చేస్తోంది. దాదాపుగా అన్ని పథకాల్లోనూ కేంద్ర నిధులే ఉన్నాయంటున్నారు. ఈ ప్రచారం చాలా జోరుగా సాగుతోంది. ఇది హరీష్‌రావుకు ఆగ్రహం తెప్పిస్తోంది. అందుకే.. కేంద్ర నిధులు ఉన్నాయని నిరూపిస్తే.. తన పదవికి రాజీనామా చేస్తానని కూడా సవాల్ చేస్తున్నారు. అయితే బీజేపీ నేతలు మాత్రం.. అంత కంటే ధీటుగానే ఎదురుదాడి చేస్తున్నారు. బీజేపీ సోషల్ మీడియా కార్యకర్తల్ని బెదిరించడానికి హరీష్ రావు.. అరుస్తున్నారని… తెలంగాణకు ఆరేళ్ల కాలంలో ఇచ్చిన హామీల్ని ఒక్కటైనా నేరవేర్చారో లేదో చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. అరిచేరావుగా మారి అరిచినంత మాత్రాన జనం ఓట్లేయరని అంటున్నారు.
కానీ హరీష్ రావు మాత్రం వ్యూహాత్మకంగా టీఆర్ఎస్ పథకాలపై మరింత జోరుగా ప్రచారం జరిగే ఉద్దేశంతోనే.. బీజేపీ.. కేంద్ర నిధుల అంశాన్ని హైలెట్ చేస్తున్నారని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. అప్పుడే.. ప్రభుత్వం నుంచి లబ్ది పొందుతున్న వారు గుర్తు పెట్టుకుని ఓట్లేస్తారని అంటున్నారు. హరీష్ వ్యూహలపై బీజేపీ ఎదురుదాడి చేస్తోందో.. బీజేపీని ప్లాన్డ్ గా పథకాల ప్రచారంలోకి హరీష్ లాగుతున్నారో అర్థం కాని రాజకీయం ప్రస్తుతం దుబ్బాకలో నడుస్తోంది.