తెలంగాణా ప్రాజెక్టులను వ్యతిరేకిస్తూ జగన్ చేసిన దీక్షతోనే ఆంధ్రా, తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వాల మద్య మళ్ళీ ఘర్షణ వాతావరణం నెలకొని ఉంది. దానికి తోడు రాజోలిబండ (ఆర్.డి.ఎస్.) పై మరో వివాదం మొదలైంది. ఆ ప్రాజెక్టుపై ఆంధ్రా ప్రభుత్వం అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ తక్షణమే ఆ పనులు ఆపవలసిందిగా కర్నాటక ప్రభుత్వాన్ని కోరింది. కానీ ఆంధ్రప్రదేశ్ అభ్యంతరాలు పట్టించుకోనవసరం లేదని, ఆ పనులు ఆపవద్దంటూ తెలంగాణా నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు నిన్న కర్నాటక నీటిపారుదల శాఖ మంత్రి ఎంబి పాటిల్ కి ఫోన్ చేసి కోరారు. తాము బచావత్ ట్రిబ్యునల్ చేసిన కేటాయింపుల ప్రకారమే ఈ ప్రాజెక్టు నుంచి నీళ్ళు కోరుతున్నాము తప్ప ఆంధ్రా వాటాలో నీళ్ళను అడగడం లేదని, కనుక ఆంధ్రా అభ్యంతరాలను పట్టించుకోనవసరం లేదని, వీలైనంత త్వరగా కాలువల ఆధునీకరణ పనులు పూర్తి చేసి తెలంగాణాకి నీళ్ళు అందించమని హరీష్ రావు కోరారు. ఆంధ్రా, తెలంగాణా రాష్ట్రాలు ఒకదానిపై మరొకటి పిర్యాదులు చేసుకావడంతో ఈ వివాదం కృష్ణా జలసంఘం నుంచి తుంగభద్రా జలసంఘానికి బదిలీ అయ్యింది. కర్నాటక ప్రభుత్వం కూడా తెలంగాణాకి అనుకూలంగా ఉన్నట్లు గమనించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీని గురించి కేంద్ర జలసంఘానికి పిర్యాదు చేయాలని నిశ్చయించుకొంది. ఈ వ్యవహారంలో మూడు రాష్ట్ర ప్రభుత్వాలు భాగస్వాములుగా ఉన్నందున చివరికి ఈ వివాదం ఎప్పుడు, ఏవిధంగా ముగుస్తుందో తెలియని పరిస్థితులు నెలకొని ఉన్నాయి.