ఈటల రాజేందర్‌ను కంట్రోల్ చేయడం మంత్రి గంగుల కమలాకర్ వల్ల కావడం లేదని ముఖ్యమంత్రి కేసీఆర్ ఓ నిర్ణయానికి వచ్చినట్లుగా కనిపిస్తోంది. ఆయన ట్రబుల్ షూటర్ హరీష్ రావును రంగంలోకి దింపారు. నిన్నటిదాకా హుజూరాబాద్ నియోజకవర్గానికి చెందిన నేతలను గంగుల కమలాకర్ పిలిపించుకుని మాట్లాడేవారు.ఇప్పుడు హరీష్ వద్దకు వెళ్తున్నారు. హరీష్‌ను కలిసి..ఈటల వెంట ఉండటం లేదని.. తాము టీఆర్ఎస్ వెంటనే ఉన్నామని నిరూపించుకోవాలని హుజూరాబాద్ నియోజకవర్గంలోని టీఆర్ఎస్ నేతలకు సందేశాలు వెళ్తున్నాయి. కొంత మంది నేతలు.. హరీష్‌ను కలిసి.. తమ విధేయతను ప్రకటించుకున్నారు కూడా.
హుజూరాబాద్ విషయంలో హరీష్ రావు రంగంలోకి దిగాడని తెలియడంతో ఈటల రాజేందర్ కూడా అప్రమత్తయ్యారు. హరీష్ పైనా ఎదురుదాడి చేస్తున్నారు. ఎక్కడికి వెళ్లినా గెలిపిస్తావు కదా.. హుజూరాబాద్ వచ్చి.. ప్రయత్నం చేయాలని సవాల్ చేశారు. నిజానికి కేసీఆర్ .. హరీష్ రావును హుజూరాబాద్ పంపించడం వెనుక అనేక కోణాలున్నాయని టీఆర్ఎస్లో ప్రచారం జరుగుతోంది. దానికి కారణం.. ఉద్యమం సమయంలో… కేసీఆర్‌కు కుడి, ఎడమల్లా వ్యవహరించిన నేతలు ఈటల, హరీష్ రావే. ఉద్యమకారుల్లో వారిద్దరిపై సానుభూతి ఉంది.
ఇప్పుడు ఉద్యమకారుడి హోదాలో ఈటల.. జనంలోకి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఆయనపై గంగులను ఎటాక్‌కు నియమించడం రాంగ్ చాయిస్‌గా మారింది. అందుకే ఉద్యమకారుడైన హరీష్ రావే కరెక్టని నమ్ముతున్నట్లుగా తెలుస్తోంది. అదే సమయంలో ఈటల, హరీష్ మధ్య అనుబంధం ఉంది. ఒకప్పుడు హరీష్‌తో ఉన్న అనుబంధం కారణంగానే ఈటలను కేసీఆర్ దూరం పెడుతున్నారన్న చర్చ జరిగింది. ఇప్పుడుఅదే హరీష్ రావును.. ఈటలను నిర్వీర్యం చేయడానికి కేసీఆర్ ప్రయోగిస్తున్నారు. ఈ వ్యూహం ఎలాంటి మలుపులు తిరుగుతుందోనని టీఆర్ఎస్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది.