ఆంధ్రా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై మరోసారి విమర్శలకు దిగారు తెలంగాణ ఆపద్ధర్మ మంత్రి హరీష్ రావు. ఇంతవరకూ హరీష్ రావుగానీ, కేసీఆర్ కేటీఆర్లుగానీ… చేసిన విమర్శ ఏంటంటే… ప్రజా కూటమి అధికారంలోకి వస్తే, రాష్ట్రంలోని అభివృద్ధిని చంద్రబాబు నాయుడు అడ్డుకుంటారు అంటూ ప్రచారం సాగించారు. ఇప్పుడేమో, తెలంగాణ ఆలస్యంగా రావడానికి కారణం కూడా చంద్రబాబు నాయుడు అంటూ హరీష్ రావు విమర్శిస్తున్నారు! టీడీపీ వల్లనే తెలంగాణ ఇవ్వలేదనీ, అడ్డుకోవడానికి ఆయన చేసిన ప్రయత్నాలు అందరికీ తెలుసు అని హైదరాబాద్ లో మీడియాతో హరీష్ రావు మాట్లాడుతూ అన్నారు. నాలుగు సీట్ల కోసం రాష్ట్రాన్ని ముక్కలు చేస్తారా అని గతంలో చంద్రబాబు అన్నారనీ, అసెంబ్లీలో తెలంగాణ అనే పదాన్ని కూడా నిషేధించారన్నారు.
తెలంగాణ వచ్చాక హైకోర్టు విభజనకు అడ్డుపడ్డారనీ, కాళేశ్వరం ప్రాజెక్టు అనుమతులు రానీయకుండా ప్రయత్నాలు చేశారనీ, సీతారామ ప్రాజెక్టు అనుమతులకు వ్యతిరేకంగా వెళ్లారనీ, తెలంగాణను చీకట్లలోకి నెట్టడానికి పీపీయేలు రద్దు చేశారంటూ హరీష్ రావు ఆరోపించారు. ప్రజా కూటమి తెర వెనక మరో తీవ్రమైన కుట్ర ఉందనీ, కాంగ్రెస్ ముసుగులో తెలంగాణలో పెత్తనం చెలాయించేందుకు చంద్రబాబు వస్తున్నారన్నారు. అందుకే, ముందుగా కోవర్టులను కాంగ్రెస్ లోకి పంపించి… ఆ తరువాత, కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుని, ఇవాళ్ల ఆ పార్టీ ముసుగేసుకుని ప్రచారం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. ఇక్కడ ఆధిపత్యం కోసమే కాంగ్రెస్ తో పొత్తు అన్నారు.
నిజానికి, కాంగ్రెస్ పార్టీతో టీడీపీ పొత్తు ఎందుకు పెట్టుకుందనేది తెలంగాణ ప్రజలకు కూడా చాలా స్పష్టంగా తెలుసు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కుదిరిన పొత్తు కాదు కదా ఇది! ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదాతోపాటు, ఇతర విభజన హామీల అమలు విషయంలో కేంద్రంలోని భాజపా సర్కారు అనుసరిస్తున్న మొండి వైఖరి నుంచి కదా ఇది మొదలైంది! భాజపాతో ఆంధ్రాకి మేలు జరగదని స్పష్టమైపోయింది. ఇక, మిగిలిన జాతీయ పార్టీ అంటే, అది కాంగ్రెస్ మాత్రమే. ఆ పార్టీ కూడా ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని చాలా స్పష్టంగా హామీ ఇస్తోంది. 2014లో మోడీ హామీ ఇచ్చి మరీ అమలు చేయలేదు. ఇకపై ఏపీకి భాజపా అనుకూలంగా వ్యవహరిస్తుందన్న నమ్మకమూ లేనప్పుడు… ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ తో దోస్తీకి టీడీపీ మళ్లింది. అంతేగానీ… ఇప్పుడు హరీష్ రావు చెబుతున్నట్టు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసం కానే కాదు. ఇంకోటి… ప్రజా కూటమిలో భాగంగా టీడీపీ పోటీ చేస్తున్న స్థానాలెన్ని..? పదిహేను కూడా దాటని నంబర్ తో ఇక్కడ ఆధిపత్యం కోసం చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు అంటే ఎంతవరకూ ఆచరణ సాధ్యం అనేది సామాన్యులకు కూడా తెలుసు.