కృష్ణా నదీ జలాల వ్యవహారం ముదురుతూనే ఉంది. అపెక్స్ కౌన్సిల్ సమావేశం తర్వాత ఉమ్మడి పర్యవేక్షణ ఇంకా మొదలు కాలేదు. టెలిమెట్రీ వ్యవస్థ ఏర్పాటు జరగలేదు. ఏపీ ఎక్కువ నీటిని వాడుకుంటూ తక్కువ చూపుతోందని తెలంగాణ ప్రభుత్వం ఆగ్రహిస్తోంది. ఈ మేరకు కేంద్ర మంత్రి ఉమాభారతికి రాష్ట్ర మంత్రి హరీష్ రావు లేఖ రాశారు.
కేంద్ర మంత్రికి రాసిన లేఖలో కొన్ని గణాంకాలను హరీష్ రావు ప్రస్తావించారు. ఈనెల 16 నుంచి 27 వరకు పోతిరెడ్డి పాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి వెలుగోడుకు ఏపీ ప్రభుత్వం 5.05 టీఎంసీల నీటిని తీసుకుందని లేఖలో పేర్కొన్నారు. కానీ 1.84 టీఎంసీలే తీసుకున్నట్టు అబద్ధపు లెక్కలు చెప్తున్నారని ఆరోపించారు.
ఇటీవల ఢిల్లీలో జరిగిన అపెక్స్ కౌన్సిల్ లో తీసుకున్న నిర్ణయం ప్రకారం టెలిమెట్రీ వ్యవస్థను ఏర్పాటు చేయాలి. అది ఇంకా జరగలేదు. అది జరిగే వరకూ ఉమ్మడి పర్యవేక్షణ ఉండాలని నిర్ణయం తీసుకున్నా బోర్డు మాత్రం పట్టించుకోవడం లేదంటూ హరీష్ రావు కేంద్ర మంత్రికి వివరించారు. కృష్ణా బోర్డు వ్యవహార శైలిపై మొదటి నుంచీ తెలంగాణ ప్రభుత్వం అసంతృప్తితో ఉంది. కారణం ఏమిటో గానీ ఆ బోర్డు ఏపీకి అనుకూలంగా వ్యవహరిస్తోందంటూ పలువురు తెరాస నేతలు కూడా ఆరోపించారు. ఏపీ జలదోపిడీకి పాల్పడుతోందనే ఆరోపణ కొత్తది కాదు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ఉధృత రూపం దాల్చడానికి ముఖ్యకారణాల్లో ఇదీ ఒకటి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా ఏపీ దోపిడీని ఆపడం లేదంటూ తెలంగాణ ప్రభుత్వం గళమెత్తుతోంది. ఈ ఆరోపణలను ఏపీ ప్రభుత్వం ఖండిస్తోంది. తెలంగాణపై ఎదురు దాడి చేస్తోంది. అందుకే ఈ పంచాయితీ కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్లింది.
ఇటీవల నిర్ణయించినట్టు టెలిమెట్రీ వ్యవస్థను వీలైనంత త్వరగా ఏర్పాటు చేయాలని తెలంగాణ కోరుతోంది. ఈలోగా రెండు రాష్ట్రాల ఉమ్మడి పర్యవేక్షణకు చర్యలు తీసుకోవాల్సింది బోర్డు. కాబట్టి సదరు బోర్డు అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలంటూ కేంద్ర మంత్రిని తెలంగాణ ప్రభుత్వం కోరుతోంది. వివాద పరిష్కారం దిశగా జరిగిన ప్రయత్నం మళ్లీ మొదటికి రాకూడదంటే, బోర్డు అధికారులు అపెక్స్ కౌన్సిల్ నిర్ణయాల ప్రకారం నడుచుకునేలా చూడాల్సిందేనంటోంది తెలంగాణ సర్కార్.