రెండు తెలుగు రాష్ట్రాల మధ్య సమస్యలు ఉంటాయి… దానిపై వారు కేంద్రాన్ని సంప్రదిస్తూనే ఉంటారు. ఆ సంప్రదిపులు లేఖల దగ్గరే ఉంటాయి కానీ సమస్యలు పరిష్కరం కావు. తాజాగా అలాంటి సమస్య ఒకటి తెరపైకి వచ్చింది. ఆంధ్రప్రదేశ్‌కు బదలాయించిన సెంటర్లీ స్పాన్సర్డ్ స్కీం నిధులు రూ.495 కోట్లు తిరిగి ఇప్పించాలని మంత్రి హరీశ్ రావు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు లేఖ రేశారు. 2014-15లో సీఎస్ఎస్ కింద తెలంగాణకు హక్కుగా రావాల్సిన నగదును పొరపాటున ఆంధ్రప్రదేశ్‌లో ఖాతాలో జమచేశారని, వాటిని తిరిగి తెలంగాణకు ఇప్పించాలని ఆయనంటున్నారు.
రాష్ట్ర విభజన జరిగిన తర్వాత మొదటి సంవత్సరంలో (2014-15) కేంద్రం నుంచి వచ్చే నిధులను ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య జనాభా ప్రాతిపదికన విభజించారు. అయినప్పటికీ మొత్తం సీఎస్ఎస్ నిధులను ఆంధ్రప్రదేశ్‌కు విడుదల చేశారని గుర్తుచేశారు. దీంతో తెలంగాణ నష్ట పోయిందని లేఖలో పేర్కొన్నారు. ఈ విషయాన్ని తాము ఇప్పటికే కేంద్ర, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలతోపాటు అకౌంటెంట్ జనరల్ దృష్టికి తీసుకువెళ్లామని .. ఎనిమిదేళ్లు గడుస్తున్నా రూ.495 కోట్లను తెలంగాణకు ఇంకా సర్దుబాటు చేయలేదని పేర్కొన్నారు. ఇప్పటికైనా ఆ మొత్తాన్ని తిరిగి తెలంగాణకు విడుదల చేసేలా కృషి చేయాలని నిర్మలా సీతారామన్‌ను కోరారు.
అచ్చం అలాంటిదే కరెంట్ బకాయిల వివాదంపై ఏపీ ప్రభుత్వం కేంద్రానికి లేఖలు రాస్తోంది. తమకు ఆరున్నర వేల కోట్లు రావాలని కానీ తెలంగాణ ఇవ్వడం లేదని అంటోంది. కేంద్రం ఏపీకి ఇవ్వాలని తెలంగాణను ఆదేశిచింది. కానీ తెలంగాణ కోర్టుకెళ్లింది. ఆ వివాదం ఎటూతేలలేదు. ఇప్పుడు అలాగే ఉన్న మరో ఫిర్యాదుతో తెలంగాణ ముందుకు వచ్చింది. నిజానికి ఇలాంటి సమస్యలు .. బేసిన్లు..భేషజాలు లేవని ఒకే వేదికపై నుంచి ప్రకటించుకున్న జగన్, కేసీఆర్ చర్చించుకుంటే పరిష్కారమవుతాయి.. కానీ వీరు అలాంటి ప్రయత్నాలు చేయకుండా ఇలా లేఖలతో సరి పెట్టుకుంటున్నారు.