అధికార పార్టీగా కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీపై పూర్తి ఆధిపత్యాన్ని చూపించడంలో ఇబ్బంది పడుతోంది. ఆర్థిక పరిస్థితికి దిగజార్చేశారని.. శ్వేతపత్రం ప్రకటిస్తామంటూ కాంగ్రెస్ హడావుడి చేసింది. అన్నట్లుగా శ్వేతపత్రం ప్రకటించింది. అయితే ఆ శ్వేతపత్రంపై హరీష్ రావు చేసిన ఎదురుదాడిని మాత్రం సమర్థంగా ఎదుర్కోలేకపోయింది. చివరికి వివరణ ఇచ్చినట్లుగా మాట్లాడాల్సి వచ్చింది కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు. శ్వేతపత్రంలో ఆరు లక్ష కోట్లకుపైగా అప్పులు చేశారని.. రోజువారీ ఖర్చులకూ నిధులు లేవని.. ఆర్థిక మంత్రి భట్టి చెప్పారు.
హరీష్ రావు ఈ అంశాన్ని అవకాశంగా తీసుకున్నరు. అసలు శ్వేతపత్రం మొత్తం తప్పుల తడకేనని.. ఆరోపించారు. ఎందులో తప్పులున్నాయో చెప్పలేదు. అంతకు మించి ఆస్తులు సృష్టించామన్నారు ఇలా రాష్ట్రం దివాలా తీసిందని చెబితే.. పెట్టుబడులు వస్తాయా.. రాష్ట్ర ఇమేజ్ ను దెబ్బతీస్తున్నారని హరీష్ ఆరోపించారు. ఆంధ్ర అధికారులతో రిపోర్టులు తయారు చేయించారన్నారు. దీన్ని కాంగ్రెస్ నేతలు తిప్పికొట్టలేకపోయారు. అన్ని అప్పులు ఉన్నాయని చెప్పడమే రాష్ట్రాన్ని అవమానించడం అయితే.. నిజంగా అన్ని అప్పులు చేసిన కేసీఆర్.. రాష్ట్రాన్ని ఏం చేశారో చెప్పాలని నిలదీయాల్సింది పోయి.. డిఫెన్స్ లోకి వెళ్లిపోయారు.
మా ఉద్దేశం రాష్ట్రం ఇమేజ్ ను దిగజార్చడం కాదని.. వాస్తవాలు చెప్పడమని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ నేతలు డిఫెన్స్ లో ఉన్నారని తెలియడంతో.. మజ్లిస్ నేత అక్బరుద్దీన్ రంగంలోకి దిగి మరింత ఇరుకున పెట్టారు. కాగ్ ఆడిట్ రిపోర్టులు, ఆర్బీఐ రిపోర్టులు.. శ్వేతపత్రంలో వివరాల్లో తేడా ఉన్నాయని .. ఎవరిది నమ్మాలని ప్రశ్నించారు. కాగ్, ఆర్బీఐ రాష్ట్రం ఇచ్చే వివరాలతో రిపోర్టులు రెడీ చేస్తాయి. కానీ రాష్ట్రం వద్ద ఉన్న పూర్తి వివరాలతో శ్వేతపత్రం విడుదల చేశారు.
ఈ విషయాన్ని బలంగా చెప్పలేకపోయారు కాంగ్రెస్ నేతలు. మొత్తంగా ఆర్థిక అంశాలపై శ్వేతపత్రంలో బీఆర్ఎస్ హయాంలో భారీగా అప్పులు చేశారన్న విషయం హైలెట్ కాకుండా.. తెలంగాణ సెంటిమెంట్ ప్రయోగించి.. ఎదురుదాడి చేయడంలో బీఆర్ఎస్ సక్సెస్ అయిందని అనుకోవచ్చు.