ఇంతవరకు తెరాసకు వైకాపాకి మధ్య ప్రత్యక్షంగా ఎటువంటి సంబంధాలు లేవు అలాగే శత్రుత్వం కూడా లేదు. అందుకు కారణం జగన్మోహన్ రెడ్డి తెలంగాణా రాజకీయాలలో వేలుపెట్టకపోవడమేనని చెప్పవచ్చు. తెలంగాణా రాష్ట్రంలో వైకాపా ఉన్నప్పటికీ అది ఏనాడూ తెరాస ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక్క మాట మాట్లాడలేదు పైగా అవసరమయినప్పుడు డానికి ప్రత్యక్షంగానో పరోక్షంగానో సహకరిస్తూ ఉండేది. కనుక తెరాస కూడా ఏనాడూ వైకాపాని పల్లెత్తు మాటనలేదు. కానీ ఇప్పుడు వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి తెలంగాణా ప్రభుత్వం చేపడుతున్న పాలమూరు, డిండి తదితర ప్రాజెక్టులని వ్యతిరేకిస్తూ మే 16 నుండి మూడు రోజుల పాటు కర్నూలులో నిరాహార దీక్షకి కూర్చోబోతున్నట్లు ప్రకటించడంతో ఊహించినట్లే తెరాస స్పందించింది.
తెలంగాణా నీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు జగన్మోహన్ రెడ్డిపై విమర్శలు గుప్పించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, “పాలమూరు ప్రాజెక్టుని వ్యతిరేకిస్తూ జగన్ నిరాహార దీక్ష చేయాలనుకోవడం చూస్తుంటే ఆయన కూడా తన తండ్రిలాగే తెలంగాణా పట్ల వివక్ష చూపుతున్నట్లు అర్ధమవుతోంది. ఆంధ్రాలో తెదేపా, వైకాపాలు మధ్య జరుగుతున్న రాజకీయాల కోసమే తెలంగాణాలో ప్రాజెక్టులపై కూడా జగన్ రాజకీయాలు చేస్తున్నారని అర్ధమవుతూనే ఉంది. చంద్రబాబు నాయుడు డిల్లీ స్థాయిలో, జగన్ రాష్ట్ర స్థాయిలో మా ప్రాజెక్టులను అడ్డుకొనేందుకు ప్రయత్నిస్తున్నారు.
తెలంగాణా ప్రజల సంక్షేమం కోసం చేపట్టిన ఈ ప్రాజెక్టుని వారిరువురూ అడ్డుకొనే ప్రయత్నాలు చేయడం చాలా శోచనీయం. వెయ్యి మంది చంద్రబాబులు, జగన్ లు కలిసి వచ్చినా పాలమూరు ప్రాజెక్టుని అడ్డుకోలేరు,” అని అన్నారు.
హరీష్ రావు మాటలలో జగన్ ఈ అంశాన్ని తన రాజకీయ ప్రయోజనాల కోసమే వాడుకొంటున్నారన్నట్లు మాట్లాడటం గమనిస్తే, తెరాస ప్రభుత్వం కూడా దీనిపై ఆయన చిత్తశుద్ధిని విశ్వసించడం లేదని అర్ధమవుతోంది. జగన్మోహన్ రెడ్డికి నిజంగానే ఆంధ్రా ప్రయోజనాలు ముఖ్యమనుకొన్నట్లయితే గత రెండేళ్లలో తెలంగాణా ప్రభుత్వాన్ని చాలా సార్లు ప్రశ్నించవలసి ఉండేది కానీ ఏనాడు ప్రశ్నించలేదు కనుకనే ఈ పోరాటాన్ని కూడా అనుమానించవలసి వస్తోంది.