తెలంగాణా రైతులని ముంచి, ఇక్కడి భూములలో పులిచింతల ప్రాజెక్టు కట్టి ఆంధ్రాలో మూడవ పంటకి నీళ్ళు అందించిన మహానుభావులు ఎవరు? అని మంత్రి హరీష్ రావు ప్రశ్నకి చాలా మంది సరైన సమాధానం చెప్పలేకపోవచ్చు. కనుక వారికి ఆ శ్రమ తప్పిస్తూ ఆయనే వారి పేర్లను చెప్పేశారు. ఆనాడు మంత్రులుగా ఉన్న కె.జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇరువురూ దగ్గరుండి తెలంగాణాలో (నల్గొండ జిల్లాలో నెమలిపురి) రైతుల భూములు గుంజుకొని పులిచింతల ప్రాజెక్టు కట్టి ఆంధ్రా రైతులు మూడవ పంట పండించడానికి నీళ్ళు అందించిన మహానుభావులని, ఆ ప్రాజెక్టు ఉన్నది తెలంగాణాలో నీళ్ళేమో ఆంధ్రాకి అని హరీష్ రావు ఎద్దేవా చేశారు. అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి జలయజ్ఞం పేరిట ఆ ప్రాజెక్టు మొదలుపెడితే, ఆయన ప్రభుత్వంలో మంత్రులుగా వారిద్దరూ గట్టిగా అభ్యంతరం చెప్పకపోగా దగ్గరుండి భూసేకరణ చేసిపెట్టారని హరీష్ రావు ఎద్దేవా చేశారు. అప్పుడు ఆంధ్రాలో మూడో పంటకి నీళ్ళు అందించడానికి తహతహలాడిన వాళ్ళిద్దరూ ఇప్పుడు మా ప్రభుత్వం, నల్గొండలో లక్ష ఎకరాలకి నీళ్ళు అందిస్తామంటే వద్దు వద్దు అని అడుపడుతున్నారని హరీష్ రావు విమర్శించారు. హారీష్ రావు చెప్పిన దానిప్రకారం చూస్తే వారిరువురూ తెలంగాణా ప్రజలకి విలన్లుగా కనిపించవచ్చేమో కానీ ఆంధ్రా ప్రజలకి నిజంగానే మాహానుభావులేనని చెప్పకతప్పదు.