హరీష్ రావు సూపర్… కాంగ్రెస్ నేతలు మొత్తం దాడి చేస్తున్నా ఆయన.. గొప్పగా సమాధానం ఇచ్చారు.. అని కేటీఆర్ ట్వీట్ చేశారు. అంటే ఆయన ఆట చూస్తూ… గ్యాలరీలో కూర్చుని ఎంజాయి చేసి.. ఆట అయిపోయిన తర్వాత నైతిక విజయం మనదేనని..తన టీమ్ సభ్యుడ్ని ప్రోత్సహించిటనట్లుగా ఉంది. ఇంతా చేసి ఆయన ప్లేయర్. ఇంకా చెప్పాలంటే.. యాక్టింగ్ కెప్టెన్ ఆయన. నాన్ ప్లేయింగ్ కెప్టెన్ గా కేసీఆర్ చాలా కాలంగా వ్యవహరిస్తూంటే… టీమ్ మొత్తం తన చేతుల్లోనే ఉంటుందని కేటీఆర్ వర్కింగ్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్నారు. కానీ అత్యంత కీలక విషయాల్లో మాత్రం హరీష్ రావును గ్రౌండ్ లోకి నెట్టేసి తాను ఆట అయిపోయాక చప్పట్లు కొడుతున్నారు.
అసెంబ్లీలో సాగునీటి ప్రాజెక్టులపై చర్చలు కాంగ్రెస్ గట్టిగా ఎదురుదాడి కి దిగుతుందని అందరికీ తెలుసు. పాత విషయాలు.. రికార్డులు అన్నింటినీ బయట పెడుతుంది. వాటిని ఎదుర్కోవడం ఒక్క హరీష్ రావు వల్ల కాదు. ఆయనకు సపోర్టుగా మరో వాయిస్ ఉండాలి. కేసీఆర్ సభభకు వచ్చి మాట్లాడితే ఆయన ఒక్కరు మాట్లాడినా సరిపోయేది. ఆయన గతంలో సీఎంగా చేశారు కాబట్టి వర్కవుట్ అవుతుంది. కానీ హరీష్ రావు.. ఒక్క టర్మ్ లోనే ప్రాజెక్టుల మంత్రిగా చేశాడు. తర్వాత చేయలేదు. అందుకే ఆయన ఇచ్చిన ఆన్సర్లను అధికారపక్షంగా తేలికగా తీసుకుంది.
హరీష్ .. కాంగ్రెస్ దాడిని తట్టుకునేందుకు శక్తివంచన లేకుండా ప్రయత్నించారు. ఆయనకు తోడుగా కేటీఆర్ కూడా ఉండి ఉంటే… గొప్పగా ఉండేదన్న అభిప్రాయం బీఆర్ఎస్ లో ఉంది. కీలకమైన అంశాల విషయంలో కేటీఆర్ కాంగ్రెస్ ను ఎదుర్కోవడానికి వెనుకడుగు వేస్తున్నారన్న అభిప్రాయం వినిపిస్తోంది. కేటీఆర్ చర్చలోకి వస్తే కొత్త విషయాలు తెరపైకి తెస్తారన్న కారణంగానే ఆయన వెనుకడుగు వేసినట్లుగా చెబుతున్నారు.