తెలంగాణా నీటిపారుదల శాఖ మంత్రి టి. హరీష్ రావు సంగారెడ్డిలో నిన్న మీడియాతో మాట్లాడుతూ, “నా జీవితంలో ఇదే చాలా పెద్ద పదవి. ఇంతకంటే పెద్దది రాదు,” అని అనడం అందరినీ ఆశ్చర్యపరిచింది. తెరాస అధికారంలోకి వచ్చిన తరువాత ఆయన తెరాసలో, ప్రభుత్వంలో రెండవ స్థానం ఆశించారు. కెసిఆర్ ముఖ్యమంత్రి పదవిని అట్టేబెట్టుకొని హరీష్ రావుకి పార్టీ అధ్యక్ష పదవిని ఇస్తారని అందరూ భావించారు. ఆవిధంగా జరుగలేదు కానీ కెసిఆర్ కుమారుడు కెటిఆర్ కి క్రమంగా పార్టీలో, ప్రభుత్వంలో ప్రాధాన్యత కలిగేవిధంగా కెసిఆర్ పావులు కదిపారు. కెటిఆర్ కూడా తండ్రి అందించిన ఆ అవకాశాన్ని చక్కగా అందిపుచ్చుకొని తన సత్తా చాటుకొంటున్నారు. కెటిఆర్ ఎదుగుదల చూస్తున్నవారెవరికైనా ముఖ్యమంత్రి కెసిఆర్ కి అసలైన వారసుడు ఆయనేనని అంగీకరిస్తారు. హరీష్ రావుకి కూడా ఆ సంగతి గ్రహించారు కనుకనే ఈవిధంగా అని ఉండవచ్చు. కానీ కెటిఆర్ కూడా హరీష్ రావు మాదిరిగానే ‘ఈ మంత్రి పదవే నాకు చాలా ఎక్కువ’ అని సన్నాయి నొక్కులు నొక్కుతుంటారు. మరోపక్క తండ్రి అప్పగిస్తున్న అదనపు మంత్రి పదవులని హుందాగా స్వీకరిస్తూనే ఉంటారు.
హరీష్ రావు ఈ అసంతృప్తిని ఏనాడూ బయటపెట్టుకొనప్పట్టికీ, అప్పుడప్పుడు ఈవిదంగా ఆయన మాటలలో బయటపడుతుంది. అప్పుడు ముఖ్యమంత్రి కెసిఆర్ ఏదో ఒక సందర్భాన్ని పురస్కరించుకొని హరీష్ రావుని ప్రజలు, మీడియా ముందు బహిరంగంగా తెగ పొగిడేసి మళ్ళీ దారిలోకి తెచ్చుకొంటూ ఉంటారు. బహుశః మళ్ళీ ఇప్పుడు కూడా అలాగే జరుగుతుందేమో? అయితే పార్టీలో ఒక్క హరీష్ రావు మాత్రమే కాకుండా ఇంకా చాలా మంది అసంతృప్తిగా ఉన్నారు. తెలంగాణా సాధన కోసం కెసిఆర్ కలిసి పనిచేసి, చిరకాలంగా పార్టీకి సేవ చేస్తున్న తమని కాదని కాంగ్రెస్, తెదేపాల నుంచి తెరాసలోకి వస్తున్న నేతలకి మంత్రి పదవులు, రాజ్యసభ సీట్లు కట్టబెడుతున్నందుకు, మంత్రులందరినీ పక్కనబెట్టి కెటిఆర్ కి మాత్రమే ప్రాధాన్యం ఇస్తునందుకు, పార్టీలో చాలా మంది అసంతృప్తిగా ఉన్నారు. ఆ అసంతృప్త నేతలందరూ ఎన్నికల సమయంలో హరీస్ రావు అధ్వర్యంలో ఏకమై కెసిఆర్ వ్యతిరేకంగా కోరస్ పాడినా ఆశ్చర్యపోనవసరం లేదు.