హైదరాబాద్: కాంగ్రెస్ ప్రజా వ్యతిరేక పాలనకు వ్యతిరేకంగా ఎన్టీఆర్ చేతుల్లో పురుడు పోసుకున్న తెలుగుదేశం పార్టీ ఇవాళ కాంగ్రెస్ మద్దతు తీసుకోవటం దారుణమని తెలంగాణ భారీ నీటిపారుదలశాఖమంత్రి హరీష్ రావు అన్నారు. ఎన్టీఆర్ బతికుంటే ఈ ఘోరాన్ని చూసి ఉరేసుకునేవారని వ్యాఖ్యానించారు. ప్రాజెక్టులను అడ్డుకుంటున్న కాంగ్రెస్, టీడీపీ నేతలను ప్రజలు నిలదీయాలని పిలుపునిచ్చారు. టీటీడీపీ నేతలు తెలంగాణ ప్రజల పక్షమో, చంద్రబాబు పక్షమో తేల్చుకున్న తర్వాతే ప్రభుత్వ విధానాలపై మాట్లాడాలని అన్నారు. వారు బాబు మెప్పుకోసం ప్రయత్నిస్తున్నారే తప్ప, తెలంగాణ ప్రజల అభివృద్ధి, సంక్షేమం కోసం కాదని విమర్శించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజల కష్టాలు తీర్చేందుకు రాష్ట్రంలోని కోటి ఎకరాలకు కాల్వల ద్వారా సాగునీరు అందించే బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారన్నారు. ఈ పథకాన్ని అడ్డుకునేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు సీడబ్ల్యూసీకి, కేంద్రానికి ఫిర్యాదు చేస్తూ తెలంగాణ ప్రజల నోట్లో మట్టి కొట్టేందుకు కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. వ్యవసాయం దండగని, ఉచిత విద్యుత్ వైర్లపై బట్టలు ఆరేసుకోటానికి పనిచేస్తుందని విమర్శలు చేసి, రైతులపై కాల్పులు జరిపించిన టీడీపీ నేతలు ఇప్పుడు మొసలి కన్నీరు కారుస్తున్నారన్నారు. అకాల వర్షం వల్ల నష్టపోయిన రైతాంగానికి ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వని కాంగ్రెస్ నేతలు అన్నదాతల గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని వ్యాఖ్యానించారు. గత పాలకుల నిర్లక్ష్యమే నేడు రైతుల ఆత్మహత్యలకు కారణమని హరీష్ అన్నారు.