కేసీఆర్ సర్కారులో పూర్తిగా పనిమీద శ్రద్ధ కనబరుస్తూ.. తమ శాఖ పరిధిలో కొన్ని అద్భుతాలను సృష్టించాలని తపనపడే కొందరు మంత్రులు ఉండడం ఒక రకంగా తెలంగాణకు చాలా బలం. అలాంటి మంత్రుల్లో కేసీఆర్ మేనల్లుడు హరీష్‌రావు కూడా ఒకరు. రాజకీయ అంశాలు ఎలా ఉన్నప్పటికీ.. తెలంగాణ ప్రయోజనాలు, తన శాఖ పరిధిలోని పనుల పరంగా ఆయన చాలా దూకుడుగా ఉంటారనేది అందరికీ తెలిసిన సంగతే. శుక్రవారం కూడా అదే జరిగింది. పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టు పనుల ప్రారంభం, పరిశీలన సందర్భంగా రోజంతా సుడిగాలి పర్యటనలు నిర్వహిచిన మంత్రి హరీష్‌రావు లిఫ్ట్ వద్దనే రాత్రి బస చేశారు. తన స్థాయికి తగిన సౌకర్యాలు ఏమీ పట్టించుకోకుండా.. చాపలు తెప్పించుకుని, వాటిని పరచుకుని అక్కడే పడుకుని నిద్రించారు. ఇక ఆయనతో పాటు మిగిలిన మంత్రులు, ఇతరులు కూడా అక్కడే నేలమీదే పడుకుని రాత్రి నిద్రనుపూర్తి చేయడం విశేషం.
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగాను, ఒక రకంగా చెప్పాలంటే వివాదాలను తొక్కేసుకుంటూను చేస్తున్న పని పాలమూరు ఎత్తిపోతల పథకం. దీనికి సంబంధించిన పనులకు హరీష్‌రావు శుక్రవారం శ్రీకారం చుట్టారు. నార్లాపూర్ వద్దకే ఆయన హెలికాప్టర్లో చేరుకున్నారు. పనులు ప్రారంభించాక అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహించారు. పనులు చేయడానికి డెడ్లైన్లు విధించారు. మళ్లీ హెలికాప్టర్ ఎక్కి.. ఏరియల్ సర్వే నిర్వహించారు. ఈ ఎత్తిపోతల పథకాలను సత్వరం పూర్తి చేయడం ద్వారా ఈ ఖరీఫ్‌లోనే నాలుగు లక్షల ఎకరాలకు నీళ్లివ్వడం గురించి కూడా చెప్పారు. పంప్‌హౌస్‌లోకి దిగి పనుల్ని పరిశీలించిన హరీశ్‌రావు.. అర్ధరాత్రి వరకు అధికారులతో అక్కడే సమీక్ష సమావేశాలు నిర్వహించారు. పనులు వేగంగా పూర్తి కావాలని, అవసరమైతే మంత్రులు కూడా క్యాంపు కార్యాలయాల వద్దే నిద్రిస్తారని హెచ్చరించారు.
కల్వకుర్తి పరిధిలో ఉండే ఎత్తిపోతల పనుల క్యాంపులోనే ఆయన నిద్రకు ఉపక్రమించారు. అప్పటికప్పుడు అనుకోకుండా మంత్రి అక్కడ రాత్రి బస చేయడానికి పూనుకోవడంతో అధికారులు ఏర్పాట్ల విషయంలో కంగారు పడ్డారు. కనీసం అక్కడ పడుకోవడానికి మంచాలు కూడా లేకపోవడం వారిని కంగారు పెట్టింది. అయితే హరీష్ చాపలు తెప్పించుకుని, ఫ్లోర్ మీదనే వాటిని పరచుకుని రాత్రంతా అక్కడే నిద్రపోయారు. ఆయనతోపాటు మరో మంత్రి లక్ష్మారెడ్డి, ఎమ్మెల్యేలు శ్రీనివాసగౌడ్, ఆల వెంకటేశ్వరరెడ్డి, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్‌రెడ్డి కూడా అక్కడే నిద్రపోవడం విశేషం.