నందమూరి బాలకృష్ణకు తెలంగాణ మంత్రి హరీష్ రావు రూ. ఆరు కోట్ల విలువైన బహుమతి ఇచ్చారు. అయితే ఇది ఇద్దరూ వ్యక్తిగతంగా ఇచ్చుకున్నది.. పుచ్చుకున్నది కాదు. పేదలకు క్యాన్సర్ వైద్యం అందించడంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి పేరు తెచ్చుకున్న బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి చెల్లించాల్సిన పన్నును మినహాయింపు ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం. ఆ మొత్తం రూ. ఆరు కోట్ల వరకూ ఉంటుంది. అందుకే .. హరీష్ రావు జన నాయకుడని బాలకృష్ణ పొగిడారు.
బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రిసెర్చ్ ఇనిస్టిట్యూట్ 22వ వార్షికోత్సవ వేడుకలకు తెలంగాణ వైద్యారోగ్య శాఖ మంత్రి హరీషరావు ముఖ్య అతిథిగా హజరయ్యారు. ఆదర్శమైన నాయకుడు హరీష్ రావు అన్నారు. ఒక్కసారి వెళ్లి కలిస్తేనే.. ఆరు కోట్ల రూపాయిలను మాఫీ చేశారని బాలకృష్ణ అభినందించారు. హరీష్ రావు కూడా బాలకృష్ణను పొగడ్తలతో ముంచెత్తారు. ఎవరు అయిన ఒక రంగంలో రణిస్తేనే గొప్పగా చెపుతాం, కానీ సేవారంగం, సినిమా రంగం, రాజకీయ రంగం ఇలా అన్నిటిలో రాణిస్తూ, తండ్రి ఎన్టీఆర్ ఆశయాలును ముందుకు తీసుకువెళ్తున్న నిత్య కృషివలుడు నందమూరి బాలకృష్ణ అని హరీష్ రావు ప్రశంసించారు.
నిజానికి బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి సీఎం కేసీఆర్ ప్రభుత్వ పరంగా సహకారం అందిస్తూ ఉంటారు. సీఎం కేసీఆర్ సొంత నివాసం బంజారాహిల్స్లో ఉంటుంది. ఆ ఇంటికి సమీపంలోనే బసవతారకం ఆస్పత్రి ఉంటుంది. ఆ ఆస్పత్రికి వచ్చే తెలంగాణకు చెందిన అనేక మంది పేషంట్లు సాయం కోసం కేసీఆర్ ఇంటి దగ్గరకు వెళ్లేవారు. ఆ ఆస్పత్రి సేవలపై మంచి అభిప్రాయం ఉన్నకేసీఆర్.. పలు రకాల మినహాయింపులు కూడా ఇస్తూ వస్తున్నారు.