హైదరాబాద్: ఒక దినపత్రికలో ఓ అభాగ్య కుటుంబంగురించి వచ్చిన కథనం చదివి చలించిపోయిన తెలంగాణ రాష్ట్ర నీటిపారుదలశాఖమంత్రి హరీష్ రావు వారికి వెంటనే గృహవసతి కల్పించి అభినందనీయంగా నిలిచారు. మెదక్ జిల్లా కొండపాక మండలం బందారం గ్రామంలో గాలవ్వ అనే మహిళ కొన్నేళ్ళక్రితం భర్తను కోల్పోయింది. పులిమీద పుట్రలో ఆమెకు క్యాన్సర్ వ్యాధి సోకింది. మరోవైపు పెద్ద కొడుకు రక్తసంబంధ వ్యాధి, చిన్న కూతురు పోషకాహార, వినికిడిలోపంతో బాధపడుతున్నారు. ఆర్థిక పరిస్థితికూడా అధ్వాన్నంగా ఉంది. ఆస్తులేమీ లేవు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇల్లు మంజూరు చేసినా బిల్లు ఇవ్వలేదు. శిథిలమైన గోడలపై ప్లాస్టిక్ కవర్ కప్పుకుని కాలం వెళ్ళదీస్తున్న ఈ అభాగ్యులపై ఒక దినపత్రిక రెండు నెలలక్రితం కథనం ఇచ్చింది. ఇది చదివిన మంత్రి హరీష్ రావు, వెంటనే వారికి ఇల్లు నిర్మించాలని అధికారులను ఆదేశించారు. కొన్నిరోజులక్రితమే ఇల్లు పూర్తయింది. అయితే మంత్రి హరీష్ రావు వచ్చేవరకు గృహప్రవేశం చేయబోమని గాలవ్వ కుటుంబ సభ్యులు పట్టుపట్టుకుని కూర్చున్నారు. దాంతో గత మంగళవారం హరీష్ వెళ్ళి ఇంటిని ప్రారంభించారు. వంట సామాగ్రి, ఇతర ఫర్నిచర్కూడా సమకూర్చారు. కుటుంబ సభ్యులను విడివిడాగా పలకరించి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.
ప్రజా సమస్యలపై ఇలా స్పందిస్తారు కాబట్టే సిద్దిపేట నియోజకవర్గంలో అప్పటినుంచి హరీష్ రావు రికార్డ్ స్థాయి భారీ మెజారిటీతో గెలుస్తూ వస్తున్నారు. నిజానికి రాజకీయ నాయకుడికి ఉండవలసిన లక్షణం ఇదే. ప్రతిదీ రాజకీయంగా ఆలోచించటంకాకుండా సాటి మనిషిలా స్పందించే హృదయం ఉండాలి. అందుకే తెలుగుదేశం పార్టీ యువనేత నారా లోకేష్లాంటి ప్రత్యర్థి పార్టీ నాయకుడి అభిమానాన్నికూడా హరీష్ గెలుచుకున్నారు. ఎప్పుడూ ప్రజలలో ఉండే హరీష్ రావు తనకు ఆదర్శమని లోకేష్ ఇటీవల ఒక ఆంగ్లదినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు.