హరీష్ రావు హుజురాబాద్ నియోజకవర్గానికే పరిమితం అయ్యారు. ఉపఎన్నికలు ఎప్పుడు జరుగుతాయో తెలీదు. కానీ ఆయన మాత్రం కేసీఆర్ ఇచ్చిన బాధ్యత మేరకు హుజురాబాద్‌పైనే పూర్తి స్థాయిలో దృష్టి కేంద్రీకరించారు. ఏదో ఓ కార్యక్రమం చేపడుతూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. హుజురాబాద్‌లో రెడ్డిసామాజికవర్గం ఈటల వైపు మొగ్గుతో ఉందని అంచనా వేసి ఆ సామాజికవర్గ ప్రజలను ఆకట్టుకోవడానికి కొత్త ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రత్యేకంగా ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసి .. రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చేశారు.
ఈటల ఒక్క ఇల్లు కూడా కట్టించలేదని తాము ఐదు వేల ఇళ్లు కట్టిస్తామని.. అలాగే ఇంటి స్థలం ఉన్న రెడ్లకు ఇళ్లు కట్టుకునేందుకు ఆర్థిక సాయం చేస్తామనే హామీల వర్షం గుప్పిస్తున్నారు. ఒక్క రెడ్డి సామాజికవర్గమనే కాదు వరుసగా ఇలా కులపరమైన మీటింగ్‌లు పెడుతూ హరీష్ హామీలు ఇస్తున్నారు. ఆయా కులాల్లోని ప్రముఖులకు తాయిలాలు కూడా ఇస్తున్నారన్న ప్రచారం ఉంది. హుజురాబాద్ బాధ్యతను ఒక్క హరీష్‌కే ఇవ్వడంతో ఆయన మాత్రమే కష్టపడుతున్నారు. ఇతర నేతలు లైట్ తీసుకుంటున్నారు.
కేటీఆర్ అయితే అదో చిన్న ఎన్నిక అని సందర్బం ఉన్నా లేకపోయినా చెబుతున్నారు. హుజురాబాద్‌లో ఇద్దరు మిత్రుల పోరాటం అన్నట్లుగా మారిపోయింది. ఈటల , హరీష్ రావు వ్యక్తిగత విమర్శలు కూడా చేసుకుంటున్నారు. ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయో తెలియదు కానీ హరీష్ కు మాత్రం చాలా పెద్ద టాస్కే పడిందని నేతలు గుసగుసలాడుకుంటున్నారు. గెలిస్తే హరీష్‌కు ఏమైనా ప్రయోజనం ఉంటుందో లేదో కానీ.. ఓడిపోతే మాత్రం హరీష్ కు గడ్డు పరిస్థితేనని టీఆర్ఎస్లో ఇప్పటికే చర్చలు జరుగుతున్నాయి.