రేవంత్ రాజీనామా చేస్తే తాను సీఎంగా బాధ్యతలు చేపట్టి మేడిగడ్డ మరమ్మతులు పూర్తి చేస్తానని హరీష్ రావు చేసిన వ్యాఖ్యలు ఆయనకు కొత్త చిక్కులు తెచ్చి పెడుతున్నాయి. ఆయన ఏ ఉద్దేశంతో అన్నారో కానీ బీఆర్ఎస్ లో ఆయన పై అపనమ్మకాన్ని పెంచడానికి ఇతర పార్టీల నేతలు చేయాల్సినదంతా చేస్తున్నారు. కేసీఆర్ అవినీతిని వ్యతిరేకించి వస్తే హరీష్ ను బీజేపీలో చేర్చుకుంటామని బండి సంజయ్ ఆఫర్ ఇచ్చారు. ఆ తర్వాత సోషల్ మీడియాలో కొంత మంది బీజేపీలోకి హరీష్ అనే ప్రచారం ప్రారంభించారు.
కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా బీఆర్ఎస్లో ఎంత కష్టపడినా హరీశ్‌రావుకు ప్రయోజనం ఉండదని అందుకే పార్టీ మారాలని సలహాలు ప్రారంభించారు. ఇది హరీష్ రావుకు ఇబ్బందికరంగా మారింది. బీఆర్ఎస్లో కేసీఆర్ తర్వాత ఆ స్థానం కేటీఆర్ అన్నది బహిరంగ రహస్యమే. రెండేళ్ల కిందటే ఆయనను సీఎం చేస్తారని వార్తలు వచ్చాయి. దానికి బలం చేకూర్చేలా తలసాని మొదలు చాలామంది మంత్రులు కేటీఆర్‌కు ఆ సామర్థ్యం ఉన్నదని కితాబు కూడా ఇచ్చారు. ప్రధాని కూడా కేసీఆర్ తన తనయుడిని సీఎం చేయడానికి సాయం చేయాలని కోరారని హైదరాబాద్ పర్యటనలో చెప్పారు.
రాజకీయ పార్టీల నేతలు ఎవరైనా.. తమ పార్టీ అధినేత కేంద్రంగానే రాజకీయం చేస్తారు. మీకు చేతకపోతే దిగిపోండి కేసీఆర్ చేసిచూపిస్తారని అంటారు. హరీష్ రావు కూడా గతంలో ఎన్నో సార్లు అలాంటి డైలాగులు చెప్పారు. కానీ ఇప్పుడు కేసీఆర్ స్థానంలో తనను చెప్పుకోవడమే అనేక ప్రశ్నలకు కారణం అవుతోంది. రేవంత్ అన్న మాటలకుకౌంటర్ గానే హరీష్ అన్నారు కానీ.. మరో ఉద్దేశం లేదని ఆయన వర్గీయులు చెబుతున్నారు. కానీ చిన్న బొక్కను రాజకీయాల్లో పెద్ద అగాధం చేసేందుకు చాలా మంది ఉంటారు. ఇప్పుడు హరీష్ విషయంలో అదే ప్రయత్నం చేస్తున్నారు. ఎంత వర్కవుట్ అవుతుదో చూడాల్సి ఉంది.