తెలంగాణ బడ్జెట్ ఈ సారి ఘనంగా ఉంది. కరోనా వల్ల ఆర్థికంగా కష్టాలు ఎదురైనప్పటికీ.. ఈ సారి ఏడాదికి ఏకంగా 2 లక్షల 30 వేల 825 కోట్లతో పద్దును ఆర్థిక మంత్రి హరీష్ రావు ప్రతిపాదించారు. అందులో పెట్టుబడి వ్యయం.. లక్షా 69 వేల 383 కోట్లుగా తేల్చారు. ఆర్థిక లోటు 45,509 కోట్లుగా పేర్కొన్నారు. గత బడ్జెట్ రెండు లక్షల కోట్లు కూడా దాటలేదు. ఆ బడ్జెట్లోనే ఆదాయం అందుకోవడానికి యాభై వేల కోట్ల వరకూ అప్పులు చేయాల్సి వచ్చింది. ఈ సారి గత బడ్జెట్ కంటే… 48 వేల కోట్లు అధికంగా కేటాయింపులు చేశారు. ఒక్కో ఎమ్మెల్యేకు ఏడాదికి రూ.5 కోట్ల అభివృద్ధి నిధులు.. ఎమ్మెల్సీలకు 800 కోట్లు కేటాయించి అందర్నీ ఆశ్చర్య పరిచారు. బడ్జెట్లో అత్యధిక వాటా.. రైతు బంధు పథకానికి వెళ్లింది. ఆ పథకానికి రూ.14,800 కోట్లు కేటాయించారు. ఆ తర్వాత ఆసరా పెన్షన్లకు రూ.11,728 కోట్లు కేటాయించారు. దాదాపుగా అన్ని పథకాలకూ నిధులు కేటాయింపు చూపించారు.
నిరుద్యోగ భృతి గురించి ఆలోచిస్తామన్న కేసీఆర్.. వాటికి ప్రత్యేకంగా కేటాయింపులు చేయలేదు. ఉద్యోగులకు పీఆర్సీని సభలోనే ప్రకటిస్తానని కేసీఆర్ చెప్పారు. అయితే ఉద్యోగుల జీత భత్యాలకు కేటాయింపులు… గతంలో ఉద్యోగ సంఘాలు ప్రకటించినట్లుగా 29 శాతం మేర పెరగాల్సి ఉంది. కానీ ఆ మేర పెరగలేదు. దీంతో పీఆర్సీఎంత ఇస్తారోనన్న చర్చ కూడా ప్రారంభమయింది. సహజంగానే బడ్డెట్‌ను విపక్షాలు అంకెల గారడిగా ప్రకటించాయి. ప్రవేశపెట్టే బడ్జెట్‌కు.. చేసేఖర్చుకు అసలు పొంతన ఉండదని.. మండిపడ్డారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినప్పటి నుండి అదే జరుగుతోందన్నారు. కనీసం కేటాయింపులు కూడా.. ప్రాధాన్యతా రంగాలకు చేయలేదని ఆరోపించారు. ఎప్పుడూ వాస్తవిక బడ్జెట్ అనే కేసీఆర్… ఈ సారి అలాంటి వాదన పెద్దగా చేయలేదు. వాస్తవిక బడ్జెట్ పేరుతో గత రెండేళ్లుగా రెండు లక్షల కోట్ల లోపే… లెక్కలు ప్రవేశ పెడుతున్నారు. ఈ సారి అది రెండు లక్షల 30వేల కోట్ల వరకూ వెళ్లింది.
ఇప్పుడు ఆదాయం పడిపోయిన పరిస్థితుల్లో ఇంత ఆదాయం ఎలా సమకూర్చుకుంటారన్నది ఆసక్తికరం. భూముల అమ్మకాలపై పెద్ద మొత్తంలో సమకూర్చుకుంటామని ప్రతీసారి చెబుతూంటారు. కానీ ఎప్పుడూ లక్ష్యం అందుకోరు. ఈసారి కూడా కేంద్రం నుంచి వచ్చే పన్నుల వాటా తగ్గుతుంది.. బడ్జెట్ లక్ష్యాన్నిఅందుకోవాలంటే… గత ఏడాది కన్నా ఈ సారి మరింత ఎక్కువగా అప్పులు చేయాల్సి ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.