ఒక్కొక్కరుగా ఎమ్మెల్యేలు పార్టీని వీడుతున్నారు.. ఎమ్మెల్యేలు పార్టీని వీడితే క్యాడర్ ఉంటుందా..? క్యాడర్ కూడా జంప్ చేస్తే పార్టీ పరిస్థితి ఏంటి…? ఇది బీఆర్ఎస్ అగ్రనేతల ఆందోళన. క్యాడర్ ను కాపాడుకోకుంటే పార్టీ ఉనికి కష్టం అవుతుందని టెన్షన్ పడుతున్నారు. క్యాడర్ కు అండగా ఉంటామని ఎంత భరోసా ఇస్తున్నా..ఎమ్మెల్యేలు పార్టీని వీడిన చోట కార్యకర్తలు పార్టీలో కొనసాగడం కష్టమే. ఇది హరీష్ రావు గ్రహించినట్టు కనిపిస్తున్నారు.
పలు చోట్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరడంతో క్యాడర్ కూడా వారి వెంట వెళ్లేందుకు సిద్దపడుతోంది. దీనికి బ్రేకులు వేసేందుకు హరీష్ రావు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. తెలంగాణలో ఉప ఎన్నికల అంశాన్ని తెరమీదకు తీసుకొస్తున్నారు. ఎమ్మెల్యేలు పార్టీని వీడిన చోట ఉప ఎన్నికలు వస్తాయని.. క్యాడర్ సిద్దంగా ఉండాలంటూ చెప్పుకొస్తున్నారు. బై ఎలాక్ష్హన్స్ జరుగుతాయని సంకేతాలు ఇస్తే క్యాడర్ పార్టీని వీడదని.. పైగా అధికార పార్టీలో తమకు కొత్తగా ప్రాధాన్యత ఉండదని భావించి బీఆర్ఎస్ లోనే కొనసాగుతారనేది హరీష్ అంచనా కావొచ్చు.
పార్టీ ఫిరాయింపులపై సుప్రీంకోర్టును ఆశ్రయించామని.. కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేలను మాజీలుగా మార్చుతామన్నారు హరీష్. ఎమ్మెల్యేల అనర్హత వేటు విషయంలో తుది నిర్ణయం స్పీకర్ దే. శాసన వ్యవస్థకు సంబంధించి సుప్రీంకోర్టు జోక్యం చేసుకోలేవు. పైగా.. మరికొద్ది రోజుల్లో కాంగ్రెస్ లో బీఆర్ఎస్ ఎల్పీ విలీనం ఖాయంగా కనిపిస్తోంది. ఇదే జరిగితే పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో బీఆర్ఎస్ చేసేదేమీ ఉండదు. అయినా కూడా హారీష్ రావు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను మాజీలుగా మార్చుతామనే ప్రకటన క్యాడర్ ను తాత్కాలికంగా కాపాడుకునేందు కోసమేనని అంటున్నారు.