తెలంగాణ కాంగ్రెస్‌కు ఎన్ని కష్టాలు వస్తున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆ కష్టాలన్నీ ఆ పార్టీ నేతలు తెచ్చుకుంటున్నవే. తాజాగా సీనియర్ల భేటీలు కలకలం రేపుతున్నాయి. ఈ భేటీలన్నింటికీ స్పాన్సర్ హరీష్ రావు అనే విషయం బలంగా ప్రచారమవుతోంది. ఇటీవల జగ్గారెడ్డి, వీహెచ్‌లతో హరీష్ రావు సీక్రెట్ మీటింగ్ నిర్వహించారని ఆ తర్వాతే వారు సొంత పార్టీపై యుద్ధం ప్రకటించారన్న అభిప్రాయం వినిపిస్తోంది. ముఖ్యంగా రేవంత్ రెడ్డిని మాత్రమే అదే పనిగా టార్గెట్ చేస్తూండటంతో.. అనేక మందికి అనుమానాలు వస్తున్నాయి.
ఎప్పుడూ రూపాయి ఖర్చు పెట్టని వీహెచ్ అనూహ్యంగా హోటల్ అశోకాలో సీనియర్ నేతల భేటీ పేరుతో భారీ ఏర్పాట్లు చేశారు. ఈ ఏర్పాట్ల ఖర్చులన్నీ టీఆర్ఎస్ నేతలవేనని ప్రచారం జరిగింది. దానికి తగ్గట్లుగానే ముందుగానే సమాచారం ఉండటంతో చాలా మంది సీనియర్ నేతలు హాజరు కాలేదు. జగ్గారెడ్డి, మర్రి శశిధర్ రెడ్డి మాత్రమే హాజరయ్యారు. దీంతో.. వీరి కుట్ర బట్టబయలు అయిందని రేవంత్ రెడ్డి వర్గీయులు ఆరోపించడం ప్రారంభించారు. హరీష్ రావు విషయాన్ని తెరపైకి తెచ్చారు.
నిజానికి రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ పుంజుకుందనే అభిప్రాయం వినిపిస్తోంది. రేవంత్ రెడ్డి జిల్లాల బాట పట్టారు. మన ఊరు.. మన పోరు పోరుతో నియోజకవర్గాల్లో సభలు నిర్వహిస్తున్నారు. ఎల్లారెడ్డి పేటలో ఓ వైపు రేవంత్‌కు సభకు భారీ జన స్పందన వస్తున్న సమయంలోనే ఇలా సీనియర్లు సభలు పెట్టి పక్కా వ్యూహంతోనే పక్కదోవ పట్టిస్తున్నారని నమ్ముతున్నారు. ఇదంతా కాంగ్రెస్‌లో ఉండి టీఆర్ఎస్కు సహకరించేవారి పనేనని ఓ నిర్ణయానికి వస్తున్నారు. ఇది రేవంత్ రెడ్డి పనిని మరింత సులువు చేస్తోంది.