ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా ఇవ్వాలనే అంశం.. ఆ ఒక్క రాష్ట్రానికే పరిమితం కాలేదు. ఈ అంశం తెలంగాణలోనూ రాజకీయ వేడి రాజేస్తోంది. నిన్నామొన్నటి వరకు.. ఏపీకి ప్రత్యేకహోదాకు మేము కూడా మద్దతిస్తామన్న తెలంగాణ రాష్ట్ర సమితి.. ఇప్పుడు ఏపీకి ఇస్తే మాకివ్వాల్సిందేనని ప్రకటిస్తోంది. అంతే కాదు.. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ.. ఏపీకి ప్రత్యేకహోదా ఇస్తామని నిర్ణయం తీసుకోవడంతో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేసుకోవడం ప్రారంభించారు. తెలంగాణ నుంచి ఏపీకి పరిశ్రమలను తరలించేందుకు కాంగ్రెస్ కుట్ర చేస్తోందని టీఆర్ఎస్ నేతలు.. తీవ్ర ఆరోపణలు ప్రారంభించారు.
రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత జరిగిన మొదటి సమావేశంలో… తమకు దూరమైన ఓటర్లందర్నీ దగ్గరకు చేసుకోవాలని మేథోమథనం నడిపారు. ఈ సమయంలో కాంగ్రెస్ పార్టీ హామీ అయిన ఏపీకి ప్రత్యేకహోదా అంశాన్ని తెరపైకి తీసుకు వచ్చి… ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ఆంధ్రకు ఇచ్చిన హామీని నెరవేరుస్తామని ప్రకటించారు. దీన్ని టీఆర్ఎస్ నేతలు అంది పుచ్చుకున్నారు. తెలంగాణను కాంగ్రెస్ మోసం చేస్తోందనే వాదనను తెరపైకి తీసుకు వచ్చారు. హరీష్ రావు ఈ విషయంలో మరింత దూకుడుగా ఉన్నారు. ఏపీకి ప్రత్యేకహోదా ఇచ్చి తెలంగాణ పరిశ్రమలన్నీ తరలిపోయేలా కుట్ర చేస్తున్నారంటూ కాంగ్రెస్‌పై మండిపడ్డారు. బీజేపీపై కూడా హరీష్ రావు విమర్శలు చేసినప్పటికీ… కాంగ్రెస్‌నే ప్రధానంగా టార్గెట్ చేసుకున్నారు.
ఏపీ ప్రత్యేకహోదాను అడ్డు పెట్టుకుని టీఆర్ఎస్ నేతలు రాజకీయం ప్రారంభించడంతో.. కాంగ్రెస్ నేతలకు పెద్ద చిక్కు వచ్చి పడింది. ఎన్నికల అస్త్రంగా మార్చుకునేందుకు టీఆర్ఎస్ ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే అటు పార్లమెంట్ లో గాని, ఇటు సీ డబ్ల్యూసీ లో గాని తెలంగాణ గురించి మాట్లాడకపోవడాన్ని గులాబీ పార్టీ ఎత్తి చూపుతోంది. అసలే పార్టీలేని చోట ప్రయోజనం కోసం పార్టీ చేస్తోన్న ప్రకటన తెలంగాణలో పార్టీకి ఇబ్బందిగా మారే ప్రమాదం ఉందని కాంగ్రెస్ నేతలు ఫీలవుతున్నారు. తెలంగాణ ఇచ్చింది కాంగ్రేస్ పార్టీ అనే విషయాన్ని బలంగా ప్రచారం చేయాలని నిర్ణయించారు..
ఆంధ్రప్రదేశ్‌లో వచ్చే ఎన్నికల నాటికి.. ప్రత్యేకహోదా అంశమే ప్రధాన ఎజెండా కానుంది. దీనికి సంబంధించి కాంగ్రెస్ సన్నాహాలు చేసుకుంటోంది. అందులో భాగంగానే ప్రస్తుత పరిణామాలు జరుగుతున్నాయన్న అంచనాలు కూడా ఉన్నాయి.