కేంద్రంపై విమర్శలు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం తరపున లేఖలు రాసేది కేటీఆర్ ఒక్కరే. ఇటీవలి కాలంలో కనీసం వారానికి ఒక్క సారి అయినా కేటీఆర్ ఇలాంటి విమర్శలు చేస్తూ లేఖలు రాస్తూంటారు. అయితే కొద్దిరోజుల నుంచి ఆయన సైలెంట్ అయ్యారు. ఈ సారి ఆ బాధ్యతను మరో మంత్రి హరీష్ రావు తీసుకున్నారు. సంగారెడ్డిలో ఉన్న ఆర్డినెన్స్ ఫ్యాక్టరీని ప్రైవేటుపరం చేయవద్దని రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కు లేఖ రాశారు.
హరీష్ రావు ఈ లేక ఎందుకు రాశారని బీఆర్ఎస్ నేతలే చర్చించుకుంటూ ఉంటే.. అసలు ఆర్డినెన్స్ ఫ్యాక్టరీని ప్రైవేటుపరం చేయాలన్న ప్రతిపాదనే ఎక్కడా లేనప్పుడు కొత్తగా కేంద్రానికి ఈ ఐడియా ఇస్తూ ఎందుకు లేఖ రాశారన్నది హాట్ టాపిక్ గా మారింది. ప్రైవేటీకరణ చేస్తారన్న భయంతో .. దాన్ని అడ్డుకోవాలని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ఉద్యోగుల తనను కలిశారని అందుకే లేఖ రాస్తున్నానని చెప్పుకొచ్చారు. దీనికి కారణం ఏమిటంటే.. ఆర్డర్లు లేకపోవడం అట.
హరీష్ రావు వ్యవహారం.. చూస్తే.. కేటీఆర్‌తో పోటీగా తాను కూడా కేంద్రానికి లేఖలు రాయాలని నిరూపించుకోవడానికో లేకపోతే.. రాష్ట్ర రాజకీయాల్లో కేటీఆర్.. జాతీయ రాజకీయాల్లో తాను ఉంటానని చెప్పుకోవడానికోఈ లేఖ రాశారన్న అభిప్రాయం వినిపిస్తోంది. ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ పూర్తిగా భారత సైనిక అవసరాలకు అవసరమైన ఆయుధాలను … తయారు చేస్తుంది. ఇలాంటి ఫ్యాక్టరీని ప్రైవేటుపరం చేయాలంటే చాలా కేటగిరీల్లో నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. అలాంటి నిర్ణయాలేమీ ఇప్పటి వరకూ తీసుకోలేదు.