టిఆర్ఎస్ ప్లీనరీ ఏర్పాట్ల బాధ్యతను కెటిఆర్‌కు, 27న జరిగే బహిరంగ సభ బాధ్యతను హరీశ్ రావుకు అప్పగించారు ముఖ్యమంత్రి కెసిఆర్. మామూలుగానే కెటిఆర్ ఏదైనా హరీశ్లాగా మరీ విరగబడి చేయరని అందరికీ తెలుసు. దానికి తోడు ఇతర కారణాల వల్ల ప్లీనరీ సో సో గానే జరిగింది.దీనిపై విసుక్కున్న కెసిఆర్ ఇంతటితో ఆ ముచ్చట వదిలేద్దామని అన్నారట. పైగా కెటిఆర్ ప్రధానాకర్షణగా జరుపుతున్న జనహిత సభలు కూడా బాగా తగ్గించాలని సూచించినట్టు సమాచారం. వీటన్నిటి వెనక ఒక నిరుత్సాహం వుందంటున్నారు. ఈలోగానే బహిరంగ సభ హడావుడి మొదలైంది. హరీశ్ సన్నాహాలు పెరిగాయి. ఈ సందర్భంగా మంత్రులు నాయిని నరసింహారెడ్డి, ఈటెల రాజేందర్ వంటి వారు చాలా కాలం తర్వాత హరీశ్‌ను బాగా పొగడ్డం పరిశీలకులను ఆకర్షించింది. సిద్దిపేటలో పోటీ నుంచి మరో చోటికి వెళ్లిన కెసిఆర్ చాలా తెలివైన నిర్ణయం తీసుకుని హరీశ్‌ను అక్కడ పెట్టారని నాయని అన్నారు.తను ఎక్కడ వుంటే అక్కడ విజయమేనని కూడా పొగిడేశారు. ఈటెల కూడా అదేబాణీలో మాట్లాడారు. ఇదంతా చూస్తుంటే కావాలనే కెసిఆర్ నాలుగు రోజులు అన్నా చెలెళ్లను కాస్త వెనక్కు తగ్గమని చెప్పివుంటారంటున్నారు. కాంగ్రెస్ నాయకుల విమర్శలకు సమాధానం చెప్పేందుకు కూడా ఎంఎల్ఎ జీవన్‌రెడ్డినే నియోగించారు. కాబట్టి లోలోపల ఘర్షణలు లేకున్నా గడబడి మాత్రం సాగుతున్నట్టేనని పరిశీలకులు భావిస్తున్నారు. వరంగల్ బహిరంగసభ ఎలాగూ జయప్రదం అవుతుంది గనక హరీష్ పేరు ఎక్కువగా వినిపించడం అనివార్యమని అయితే ఆయన జనసమీకరణతోనే సంతృప్తిపడవలసి వుంటుందని కూడా వారంటున్నారు. ఈ పని తను మాత్రమే చేయగలరు గనకే కెసిఆర్ అప్పగించారని ఆ ఘట్టం ముగిశాక మళ్లీ మామూలేనని చెబుతున్నారు.