దుబ్బాకలో టీఆర్ఎస్కు లక్ష ఓట్ల మెజార్టీ సాధించడమే లక్ష్యంగా పని చేస్తున్న హరీష్ రావు అసలు కాంగ్రెస్ పార్టీని లెక్కలోకి తీసుకోవడం లేదు. మరుమూల గ్రామాల్లోకి వెళ్లి బీజేపీని టార్గెట్ చేస్తున్నారు. అది కూడా జాతీయ అంశాలపై విమర్శలు చేస్తున్నారు. వ్యవసాయ చట్టాలు మార్చారని.. రైతుల్ని మోసం చేస్తున్నారని విమర్శిస్తున్నారు. వ్యవసాయ చట్టాలపై తెలంగాణలో ఎక్కడా పెద్దగా చర్చ జరగలేదు. ఆ అంశంపై రైతుల్లోకి పెద్దగా వెళ్లలేదు. అయినప్పటికీ హరీష్ రావు వాటినే పెద్ద పెద్ద అంశాలుగా రైతులకు చెబుతున్నారు. ఇక తాము రైతుల కోసం.. కేందరాన్ని ఢీ కొడుతున్నామని చెప్పుకుంటున్నారు. దానికి విద్యుత్ మీటర్ల అంశాన్ని బలంగా చూపిస్తున్నారు. ఏపీ ఆ మీటర్లను పెడుతోంది.. తాము పెట్టడం లేదని చెబుతున్నారు.
హరీష్ రావు కాంగ్రెస్ పార్టీని ఎక్కడా పెద్దగా విమర్శించడం లేదు. ఆయన వ్యూహాత్మకంగానే కాంగ్రెస్‌ను బలమైన ప్రత్యర్థిగా గుర్తించడానికి ఇష్టపడటం లేదన్న చర్చ జరుగుతోంది. బీజేపీనే ముందు పెట్టడం ద్వారా… టీఆర్ఎస్ వ్యతిరేక ఓట్లలో భారీ చీలిక తీసుకు రావొచ్చని ఆయన అంచనా వేస్తున్నారు. అందుకే.. టార్గెట్ బీజేపీ అన్నట్లుగా.. ఇతర అంశాల్లోనూ వ్యూహాత్మకంగా రాజకీయాలు చేస్తున్నారన్న చర్చ నడుస్తోంది. లక్ష ఓట్ల మెజార్టీని సాధిచాలంటే.. టీఆర్ఎస్కు ఓట్లు రావడమే కాదు.. ప్రత్యర్థుల ఓట్లను చీల్చాలన్నది హరీష్ వ్యూహం అంటున్నారు.
రాజకీయాల్లో.. హరీష్ వ్యూహాలను అంచనా వేయడం సాధ్యం కాదు. అందుకే.. ప్రధానంగా టాస్క్‌లన్నీ కేసీఆర్… హరీష్‌కే అప్పగిస్తూంటారు. మెదక్ జిల్లా మంత్రిగా ఉన్నారు కాబట్టి సహజంగానే దుబ్బాక ఎన్నికల బాధ్యత హరీష్ పై పడింది. తన వ్యూహాలు ఎంత బాగా వర్కవుట్ అవుతాయో.. నిరూపించాల్సిన అవసరం ఇప్పుడు హరీష్ రావుపై పడింది. తన పని తనాన్ని నిరూపించుకునేందుకు పక్కాగా స్కెచ్ వేసుకుంటూ వెళ్తున్నారు హరీష్. అందుకే కాంగ్రెస్‌ను ఆయన గుర్తించడానికి సిద్ధపడటం లేదంటున్నారు.